తెలంగాణలో పండించిన ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్నదని, పంజాబ్, హర్యానా తరహాలోనే ఇక్కడ కూడా వెంటనే కొనుగోలు చేయాలని బుధవారం సంగారెడ్డి, మెదక్ జిల్లా పరిషత్‌ల్లో జడ్పీటీసీలు, ఎంపీపీలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. సంగారెడ్డిలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, మెదక్‌లో జడ్పీ చైర్పర్సన్ హేమలతా శేఖర్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో కేంద్ర వైఖరిని నిరసిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని, కానీ మోదీ ప్రభుత్వం తెలంగాణ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రైతులు నూకలు తినాలని అన్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
సంగారెడ్డి మార్చి 30 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సంగారెడ్డి జిల్లా పరిషత్ ఏకగ్రీవం తీర్మానం చేసింది. బుధవారం జడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన సంగారెడ్డిలో జడ్పీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జడ్పీ వైస్‌చైర్మన్ ప్రభాకర్ రైతుల సంక్షేమం కోసం కే్రందంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని సంగారెడ్డి జిల్లా రైతుల పక్షాన తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. దీనికి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎమ్మెల్యే మాణిక్‌రావు సహా ఎంపీపీ, జడ్పీటీసీలు పార్టీలకతీతంగా తీర్మానాన్ని బలపరుస్తూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. కాంగ్రెస్ సభ్యులు సైతం తీర్మానానికి మద్ధతు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికైన తర్వాత తొలిసారిగా జడ్పీ సమావేశానికి హాజరుకావటం ఆనందంగా ఉందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణ రైతులపట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. కేంద్రం వెంటనే రైతుల పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని, లేదంటే రైతులతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతులను నష్ట పరుస్తుందన్నా రు. అమీన్పూర్ జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, కల్హేర్ జడ్పీటీసీ నర్సింహరెడ్డి, గుమ్మడిదల జడ్పీటీసీ కుమార్‌గౌడ్, అందోలు జడ్పీటీసీ రమేశ్, నాగల్గిద్ద జడ్పీటీసీ రాజురాథోడ్, హత్నూర జడ్పీటీసీ ఆంజనేయులు, కో-ఆప్షన్ సభ్యులు ముస్తఫా, న్యాల్కల్ ఎంపీపీ అంజమ్మ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులపై వివక్ష చూపుతోందని, ఇక్కడి రైతులంటే మోదీ ప్రభుత్వానికి పట్టింపులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పింఛన్లు, రైతుబంధు డబ్బులు బ్యాంకులు ఆపొద్దు
ప్రభుత్వం రైతులకు అందజేసే రైతుబంధు, ఆసరా పింఛన్ డబ్బులను ఎట్టి పరిస్థితుల్లో బ్యాంకర్లు ఆపకుండా లబ్ధిదారులకు అందజేయాలన్నారు. ఎక్కడైనా అలా నిలిపివేస్తే 24గంటల్లో లబ్ధిదారులకు అందజేయాలని కలెక్టర్ హనుమంతరావు బ్యాంకర్లను ఆదేశించారు. జడ్పీ సమావేశంలో కల్హేర్ జడ్పీటీసీ నర్సింహరెడ్డి మాట్లాడుతూ తమ ప్రాంతంలో కొందరు బ్యాంకర్లు పింఛన్, రైతుబంధు డబ్బులను బాకీ కింద జమచేసుకుంటున్నారని, లబ్ధిదారులకు ఇవ్వటంలేదని తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిసూ వెంటనే లబ్ధిదారులకు డబ్బులు అందజేసేలా చర్యలు తీసుకోవాలని ఎల్డీఎంను ఆదేశించారు. రైతుబందు పథకం కింద లబ్ధిదారులకు రూ. 10లక్షల చొప్పున ఆర్థిక చేయూత అందజేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు జిల్లాలో 288 యూనిట్లను గ్రౌండ్ చేసినట్లు చెప్పారు.
మనఊరు-మనబడి కార్యక్రమం ద్వారా జిల్లాలో 441 పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించన్నునట్లు చెప్పారు. దీంతో 80757మంది విద్యార్థులు లబ్ధిపొందనున్నట్లు తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. నాగల్గిద్ద జడ్పీటీసీ రాజురాథోడ్ మాట్లాడుతూ తన మండలంలోని కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు సక్రమంగా పనిచేయటం లేదని, పాఠశాల వేళల్లో సొంత పనులు చేసుకుంటున్నట్లు చెప్పారు. ఈ విషయమై ఫిర్యాదు చేసినా విద్యాశాఖ అధికారులు స్పందించటం లేదన్నారు. దీనిపై కలెక్టర్ హనుమంతరావు స్పంది స్తూ ఉపాధ్యాయులు సకాలంలో పాఠశాలలకు హాజరయ్యే లా చూడాలని డీఈవో రాజేశ్‌కు సూచించారు. ఇకపై ప్రభు త్వ పాఠశాలలను తనిఖీ చేస్తానని తెలిపారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు మాట్లాడుతూ ఉపాధ్యాయు లు విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని డీఈవోకు సూచించారు. జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ నారాయణఖేడ్ నియోజకవర్గం రుద్రార్లో దళితబంధు పథకం గ్రౌండింగ్ కన్నుల పండువగా జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం చరిత్రలో నిలుస్తుందని తెలిపారు.
వంటనూనెతో పాటు నిత్యావసర సరుకులను వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వైస్‌చైర్మన్ ప్రభాకర్ ఇతర జడ్పీటీసీ, ఎంపీపీలు కలెక్టర్‌కు తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఇకపై ప్రతి షాపులో నిర్ణీత ధరల పట్టికలు ఉండేలా చూడాలని తూనికలు కొలతల జిల్లా అధికారి ప్రవీణ్‌కు సూచించారు. ఇకపై ఆకస్మిక తనిఖీలు చేసి వ్యాపారులు అధిక ధరలకు అమ్మకుండా చూడాలని ఆదేశించారు. జడ్పీ సమావేశంలో వ్యవసాయశాఖ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్యశాఖ, పశు సంవర్థకశాఖతో పాటు పలు శాఖలకు సంబంధించిన సమస్యలను సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. సభ్యులు తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎమ్మెల్యే మాణిక్‌రావు, కలెక్టర్ హన్మంతరావు, అదనపు కలెక్టర్ రాజర్షిషా, లైబ్రరీ చైర్మన్ నరహరిరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, జడ్పీ సీఈవో ఎల్లయ్య పాల్గొన్నారు.