సర్కారు బడులను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో మొదటి విడుతలో భాగంగా ఇప్పటికే 441 స్కూళ్లను అధికారులు గుర్తించారు. ఈ పాఠశాలల్లో చేయాల్సిన మరమ్మతులు, కావాల్సిన సౌకర్యాలను పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఇంజినీరింగ్ అధికారులు గుర్తించి, వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ మరో రెండు రోజుల్లో ముగియనుండగా, పరిశీలన అనంతరం ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేయనున్నది. మొత్తం 12 రకాల పనులు చేపట్టనుండగా, మౌలిక వసతుల కల్పన, ఇంగ్లిష్ మాధ్యమంతో పాటు డిజిటల్ బోధన చేపట్టేందుకు సర్కారు చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వ నిర్ణయంతో భవిష్యత్‌లో గవర్నమెంట్ స్కూళ్ల రూపురేఖలు పూర్తిగా మారిపోయి తమ పిల్లలకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు అందుతాయని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డి, మార్చి 30 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు త్వరలో కొత్తరూపును సంతరించుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు- మన బడి కార్యక్రమంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించడంతో పాటు డిజిటల్ బోధన పద్ధతులు ప్రవేశపెట్టనున్నది. ఇందుకోసం ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేయనున్నది. సంగారెడ్డి జిల్లాలో మొదటి విడుతలో మన ఊరు-మనబడి కార్యక్రమంలో 441 పాఠశాలలు గుర్తించి, ఆధునీకరించనున్నారు.
ఈ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పించడంతోపాటు మరమ్మతులు, పాఠశాలల్లో పూర్తిస్థాయిలో ఫర్నిచర్ సమకూర్చడం, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు చేయడం, తదితర పనులు చేపట్టనున్నారు. మన ఊరు -మనబడి కింద ఎంపిక చేసిన 441 పాఠశాలల్లో 256 ప్రాథమిక, 61 ప్రాథమికోన్నత, 124 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో చేపట్టాల్సిన పనులను గుర్తించే బాధ్యతను పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ (తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్), పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగానికి అప్పగించారు. 318 పాఠశాలల్లో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు, 105 పాఠశాలల్లో టీఎస్ ఈడబ్ల్యూఐడీసీ, 18 పాఠశాలల్లో పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగం పనులు గుర్తించారు.
ఎంపిక చేసిన పాఠశాలల్లో 12 రకాల పనులు చేపట్టనున్నారు. అదనపు తరగతి గదులు, ప్రహరీ, టాయిలెట్స్, గదుల మరమ్మతులు, తాగునీటి సరఫరా, కిచన్షెడ్డు, కరెంటు పనులు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ఫర్నిచర్, పెయింటింగ్ పనులు చేపట్టనున్నారు. ఈనెల 1వ తేదీ నుంచి ప్రారంభమైన పనుల గుర్తింపు ప్రక్రియ సోమవారంతో పూర్తి కావచ్చింది. ప్రస్తుతం ఇంజినీరింగ్ అధికారులు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చేపట్టాల్సిన పనుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. రెండు రోజుల్లో ఈప్రక్రియ పూర్తి అవుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం వాటిని పరిశీలించి నుమతులు మంజూరు చేస్తుందని, త్వరలోనే పనులు చేపట్టేందుకు వీలుంటుందని వారు పేర్కొన్నారు.
మన ఊరు -మనబడి కింద ఎంపికైన పాఠశాలల వివరాలు
నియోజకవర్గం పేరు : ప్రాథమిక : ప్రాథమికోన్నత : ఉన్నత
అందోలు : 38 : 12 : 28
నారాయణఖేడ్ : 82 : 12 : 23
పటాన్చెరు : 30 : 05 : 21
సంగారెడ్డి : 38 : 08 : 25
జహీరాబాద్ : 56 : 23 : 20
హత్నూర (నర్సాపూర్) : 12 : 01 : 07