మనూరు, మే 13 : అధికారులు ఇష్టారాజ్యంగా జొన్నలు కొనుగోలు చేస్తూ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం మనూరు జొన్నకొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. మనూరు జొన్నల కొనుగోలు కేంద్రం అధికారులు వారికి నచ్చిన రీతిలో కొనుగోలు చేస్తున్నారని స్థానికులు మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం భూపాల్ రెడ్డి మాట్లాడుతూ అధికారులు కుమ్మక్కై రైతులను దోపిడికి గురిచేస్తున్నారని మండిపడ్డారు.
ఒక్కో క్వింటాలుకు 5నుంచి 6కిలోల చోప్పున తరుగు తీస్తూ డబ్బులు ఇస్తేనే కాంట వేస్తామని రైతులను నట్టేట ముంచుతున్నారని విమర్శించారు. తెలంగాణ రైతుల జొన్నలు కొనుగోలు చేయకుండా పక్కరాష్ట్రం నుంచి వచ్చిన జొన్నలకు డబ్బులు తీసుకుని వారి కాంటాలు ముందు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మనూరు మండల కేంద్రంలో ఇప్పటి వరకు రూ.13లక్షల కుంభ కోణం జరిగిందని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించు కోవడం లేదన్నారు.
మండల కేంద్రంలో ఎంత జొన్న పంట వేశారు, ఇప్పటివరకు కొన్న జొన్నలు ఎన్ని అనే విషయంపై జిల్లా అధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వడ్ల కొనుగోలు కేంద్రంలో కూడా ఇష్టా రాజ్యంగా కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యాక్షుడు విఠల్‌రావు పాటిల్, మాజీ ఎంపీటీసీ ముజ్జమ్మిల్, నాయకులు నాగేందర్ పాటిల్, మన్నన్ రైతులు ఉన్నారు.