సంగారెడ్డి : జిల్లాలోని అమీన్పూర్ మండలం ఎమ్మార్వో కార్యాలయానికి (MRO Office) చెందిన ఇద్దరు ఉద్యోగులు లంచం తీసుకుంటూ గురువారం రెడ్ హ్యండెడ్ గా పట్టుబడ్డారు. మండల కార్యాలయంలో ధరణి ఆపరేటర్(Dharani Operator) గా పనిచేస్తున్న చాకలి అరుణ్‌కుమార్, జూనియర్ అసిస్టెంట్(Junior Assistant) గా పనిచేస్తున్న మన్నె సంతోష్ బాధితుడు వెంకటేశం యాదవ్ నుంచి రూ. 30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB) అధికారులకు పట్టుబడ్డారు.
బండ్లగూడకు చెందిన వెంకటేశం యాదవ్ అత్తగారి ఆస్తికి సంబంధించిన ఫైలుపై సంతకాలు చేసేందుకు ఉద్యోగులు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తీసుకున్న లంచం డబ్బును ఆపరేటర్ చాకలి అరుణ్‌కుమార్ కారులో దాచుకోగా కారును తనిఖీ చేసి అందులో దాచిన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించి ఆపరేటర్ ఇచ్చిన వాంగ్మూలం మేరకు తహసీల్దార్ పి రాధను కూడా విచారించి ఆమె ఇంటిని సోదా చేశామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. కేసులో నేరుగా నిందితులుగా ఉన్న ధరణి ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్‌ను అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టామని తెలిపారు. కేసు విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు.