Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలు, రైతుల ఇబ్బందులు, రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు, సీట్లు, కమిషన్లు వేస్తూ అణచివేసే కుట్ర చేస్తోందని మాజీ మంత్రి , బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు.
సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌తో పాటు మరో ఏడుగురు పార్టీ కార్యకర్తలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పోలీసుల తీరుపై మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యం కల్పిస్తామని చెప్పి నేడు నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్, బీఆర్ఎస్ నాయకత్వంపై ఫేక్ పోస్టులు పెడుతున్న వారి గురించి పోలీసులకు ఆధారాలతో సహా ఫోన్ అప్పగించి క్రిశాంక్ ఫిర్యాదు చేశారు.. కానీ తప్పు చేసిన వారిని వదిలేసి, ఫిర్యాదు ఇచ్చిన క్రిశాంక్ నే అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గం. దొంగలను వదిలేసి ఫిర్యాదుదారులను జైల్లో పెడతారా..? ముఖ్యమంత్రి, హోం మంత్రి రెండు బాధ్యతలూ మీరే పెట్టుకుని ఇలాంటి అరాచకాలకు పాల్పడతారా..? రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు.
ఇదేనా మీ ప్రజాస్వామ్యం..?
క్రిశాంక్ పై నాన్ బెయిలబుల్ కేసులు ఎలా పెడతారని సాక్షాత్తూ మేజిస్ట్రేట్ పోలీసులను ప్రశ్నించారంటేనే మీ కక్షసాధింపు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్నారు. అంగన్వాడీ ఫోన్ల కుంభకోణం, టెన్త్ పేపర్ లీక్, హెచ్‌సీయూ గచ్చిబౌలి భూములు, సోమ్ డిస్టిలరీస్ వ్యవహారం, మిస్ వరల్డ్ పోటీల్లో మిస్ ఇంగ్లాండ్ వివాదం.. ఇలా ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపినందుకే ఆయనపై వరుసగా కేసులు పెట్టారు. భారత పౌరులకు ప్రశ్నించే హక్కు లేదా..? అని ఎండగట్టారు.
లగచర్లలో గిరిజనుల పైనా, మెదక్, సంగారెడ్డిలో మా నాయకుల పైనా అక్రమ కేసులు బనాయించారు. రేవంత్ రెడ్డి ఇలా కేసులు పెట్టి మళ్లీ గెలుస్తాననుకుంటే అది హిట్లర్ ను మించిన మూర్ఖత్వమే అవుతుందని హితవు పలికారు.
జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కూర్చుని నేనే రాజు, నేనే మంత్రి అనుకుంటున్నావు. మీ అరాచకాలను గమనిస్తున్న రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.
బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తెచ్చి కమాండ్ కంట్రోల్ రూమ్‌లో కూర్చోబెట్టారు. ప్రతిరోజూ బీఆర్ఎస్ నేతల ఫోన్లను, మా ఇళ్ల ముందున్న సీసీ కెమెరాలను చట్టవ్యతిరేకంగా హ్యాక్ చేస్తున్నారు. మా ఫోన్లు ట్యాప్ చేస్తున్న ఐపీఎస్ అధికారులకు ఇదే మా హెచ్చరిక. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చాక రిటైర్ అయినా సరే మిమ్మల్ని ఎక్కడున్నా వదిలిపెట్టం. కచ్చితంగా విచారణ జరిపిస్తామని హెచ్చరించారు.
చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న ఐపీఎస్ అధికారులకు తగిన మూల్యం తప్పదు. అప్పుడు మిమ్మల్ని రేవంత్ రెడ్డి కూడా కాపాడలేడు. మీ సొంత డబ్బుతో అడ్వకేట్లను పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి చట్టానికి లోబడి పనిచేయండి. క్రిశాంక్ ను జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి వికృత ఆనందం పొందుతున్నాడు. మీ పార్టీ కార్యాలయంలో జరిగే అవినీతి, అక్రమాల వ్యవహారాలన్నీ రికార్డు అవుతున్నాయి. రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ.
వంద కోట్లతో కొత్త ప్యాలెస్ కట్టుకుంటున్నావు…
జూబ్లీహిల్స్ ప్యాలెస్ చాలదన్నట్టు ఎంసీఆర్హెచ్ఆర్డీలో వంద కోట్లతో కొత్త ప్యాలెస్ కట్టుకుంటున్నావు. నీ పాలనలో సగం కాలం పూర్తయింది, మిగిలిన సగం కాలమైనా ప్రజలకు ఏదైనా మేలు చేసే ప్రయత్నం చెయ్ అని సూచించారు. రైతులు 20 రోజులుగా కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తుంటే శనగలు, సన్ ఫ్లవర్ కొనే నాథుడే లేడన్నారు. మీ మంత్రులు నిద్రపోతున్నారా..? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది..? ఎకరాకు కేవలం 26 క్వింటాళ్లు మాత్రమే కొంటామని మక్కలకు కొత్త షరతులు పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. 13 లక్షల ఎకరాల్లో పంట వస్తే కనీసం సగం కూడా కొనలేని దుస్థితిలో మీరున్నారు.
వడ్ల కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాలేదు. వడ్లకు ఐదారు కిలోల తరుగు తీస్తున్నారు. తరుగు పెడితే తోలు తీస్తానన్న రేవంత్ రెడ్డి ఇప్పుడెవరి తోలు తీస్తాడో చెప్పాలి. మిల్లుల ముందు లారీలు నాలుగైదు రోజులుగా ఆగిపోతున్నాయి. యాసంగి సన్నవడ్లకు బోనస్ ఇస్తావా? ఇవ్వవా? స్పష్టం చెయ్. ఇవ్వలేకపోతే తప్పుకో లేదా జరిగింది చెప్పుకో అంతేకానీ ఏ సంగతీ చెప్పకుండా రైతులను మోసం చేయొద్దు.
ఎండలో రైతులు మాడిపోతుంటే పట్టించుకునే తెలివి లేదా..? రైతుల కష్టాలు మీకు పట్టవా…? అని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా అక్రమ కేసులు బంద్ చేసి, ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు గురించి ఆలోచించు. ప్రజలు మెచ్చే పాలన అందించు అని అన్నారు. క్రిశాంక్ పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. మళ్లీ పీటీ వారెంట్లు వేసి ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని హరీష్ రావు హెచ్చరించారు.
మా పార్టీ నాయకుల మీద ఫేక్ పోస్టులు పెడుతున్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినందుకు వాళ్ల మీద కేసు పెట్టకుండా.. క్రిశాంక్ మీద కేసు పెట్టారు
దొంగతనం చేసిన వాడిని వదిలేసి.. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వాడిని లోపల పెట్టినట్లు ఉంది
క్రిశాంక్ మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు..… https://t.co/3aS33jrAlU pic.twitter.com/POjAW5ydjQ
— Telugu Scribe (@TeluguScribe) April 28, 2026