జహీరాబాద్, ఫిబ్రవరి 9 : సంవత్సరానికి ఒకసారి జరిగే పశువుల జాతర(సంత) కిక్కిరిసిపోయింది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ గ్రామ శివారులోని దర్గా ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జరిగిన ప్రత్యేక పశువుల జాతరకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి రైతులు, వ్యాపారులు పశువులను ప్రత్యేక వాహనాల్లో తీసుకువచ్చారు. పశువులను కొనుగోలు చేసేందుకు ఆయా ప్రాంతాలకు చెందిన రైతులు తరలివచ్చారు.
పశువుల సంతలో దియోనీ, ఒంగోలు, కిల్లరి తదితర జాతులకు చెందిన ఎడ్లు, కోడెదూడలు, ఆవులు, పాడిగేదెలు సుమారు రూ. 50 వేల నుంచి రూ. 3.50 లక్షల వరకు ధర పలికాయి. మానుర్ మండలం ఎటిగడ్డ ఎల్గోయికి చెందిన వెంకట్రావు రైతుకు చెందిన ఎడ్లకు రూ. 3లక్షలు ధర చెప్పాగా రాయికోడ్ నాగ్వర్కు చెందిన సమీర్ రూ. 2.50 లక్షలకు కొనుగోలు చేశాడు.
అనంతరం దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉత్తమ పశుపోషకులైన రైతులకు స్థానిక గ్రామానికి చెందిన దివంగత అడివప్ప, గిరిజమ్మ జ్ఞాపకార్థం బహుమతులను జహీరాబాద్ ఎంపీ సురేశ్‌కుమార్, టీజీఐడీసీ రాష్ట్ర మాజీ చైర్మర్ హైమ్మద్ అందజేశారు. జహీరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, డీసీసీ కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సిద్ధిలింగయ్యస్వామి, ఎంపీపీ వైస్ చైర్మన్ గౌసుద్దీన్, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ప్రముఖ శిల్పాకారుడు డా. హోతి బస్వరాజ్, జాతర నిర్వాహకులు యూనుస్‌ఖాన్, మక్సూద్, నర్సింహులు, వాహెబ్ పాల్గొన్నారు.