
జహీరాబాద్, ఆగస్టు 24 : అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ఆర్థిక సహాయం అందజేస్తున్నదని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు అన్నారు. మంగళవారం జహీరాబాద్ పట్టణంలోని వాసవి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా, దళితబంధు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు.
57 ఏండ్లు నిండిన అర్హులైన వారికి పింఛన్ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సీసీ రోడ్లు, మురుగు కాల్వలను నిర్మిస్తున్నదన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు. అనంతరం జహీరాబాద్ పట్టణంలోని బాబూమోహన్ కాలనీకి చెందిన దివ్యాంగుడికి ఎమ్మెల్యే స్వయంగా అతడి ఇంటికి వెళ్లి చెక్కును అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగేశ్వర్రావు, నయాబ్ తహసీల్దార్ కిరణ్‌కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాములు, టీఆర్ఎస్ నాయకులు గుండప్ప, పెంటరెడ్డి, నామ రవికిరణ్, ఇజ్రాల్ బాబీ, సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.
రాచన్నస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే..
కోహీర్, ఆగస్టు 24 : మండలంలోని బడంపేట రాచన్నస్వామి దేవాలయంలో సోమవారం రాత్రి శ్రావణ మాసోత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు హాజరయ్యారు. ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలోని స్వామివారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కళాకారులకు నిర్వహించే భజన పోటీలను ఆయన జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే వెంట ఆలయ కమిటీ చైర్మన్ మడపతి రాజు, ఈవో శివరుద్రప్ప, భక్తులు ఉన్నారు.
సివిల్ సర్జన్‌గా ప్రమోషన్ పొందిన వైద్యులు
జహీరాబాద్, ఆగస్టు 24 : జహీరాబాద్ సర్కారు దవాఖానలో పని చేస్తున్న డాక్టర్లు కిరణ్మయి, శ్రీధర్, శేషులకు ప్రభుత్వం సివిల్ సర్జన్‌గా ప్రమోషన్ కల్పించింది. ఈ మేరకు మంగళవారం జహీరాబాద్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఉద్యోగోన్నతి పొం దిన డాక్టర్లను ఎమ్మెల్యే మాణిక్‌రావు సన్మానించి అభినందించారు. సర్కారు దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కార్యక్రమం లో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.