
గజ్వేల్, ఆగస్టు 23 : గురుకుల, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉపాధ్యాయులకు త్వరలో పీఆర్సీ వర్తించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. సోమవారం ప్రజ్ఞాపూర్‌లోని మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గురుకుల, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉపాధ్యాయులందరికీ 30శాతం పీఆర్సీ ప్రభుత్వం త్వరలో అమలు చేయనున్నదన్నారు. 180 రోజుల మెటర్నిటీ లీవ్, సాధారణ సెలవులు, 12 నెలల వేతనం, అమలు చేసేటట్లు పీఆర్టీయూ సంఘం ద్వారా కృషి చేస్తున్నట్లు తెలిపారు. పీఆర్టీయూ మండల అధ్యక్షుడు వేమారెడ్డి మాట్లాడారు. మండల స్థాయి ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్యలు ఉన్నా, తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుధారాణి, ఉపాధ్యాయుల బృందం ఎమ్మెల్సీని ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్సీ వెంట పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఇంద్రసేనారెడ్డి, శశిధర్‌శర్మ, నాయకులు పోచయ్య, రామకృష్ణారెడ్డి, శ్రీనివాస్, కనకరాములు, రవీందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శ్రీనివాసరావు, నాగరాజు పాల్గొన్నారు.