గుమ్మడిదల, నవంబర్ 12: రైస్‌మిల్లర్లు సన్న ధాన్యాన్ని కొంటలేరని ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల, నల్లవల్లిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంగారెడ్డి అదనపు కలెక్టర్ మాధురి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సన్నధాన్యాన్ని రైస్‌మిల్లర్లు కొనుగోలు చేయడం లేదని పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల విష్ణువర్ధన్‌రెడ్డితోపాటు ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, రైతులు అదనపు కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మిల్లర్లు సన్నధాన్యం కొనుగోలు చేసేవిధంగా వారితో మాట్లాడాలని తహసీల్దార్ గంగాభవానీకి సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో సన్న వడ్లు, దొడ్డువడ్లు ఎన్ని వస్తున్నాయో రికార్డులను పరిశీలించారు. ధాన్యంలో తాలు లేకుం డా జల్లెడ పట్టాలని ఆమె రైతులకు సూచించారు.17శాతం తేమ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైస్‌మిల్లులకు తరలించాలని ఆదేశించారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేస్తామని తెలిపారు. ఆమె వెంట ఆర్ఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎంఏవో శ్రీనివాస్‌రావు, ఏఈ వో నిఖిత, పీఏసీఎస్ సీఈవో లచ్చిరామ్, రైతులు ఉన్నారు.