సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 7: అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా చూడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ప్రత్యేకాధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇండ్లు ఉన్నవారికే ఇండ్లు ఇచ్చారని, లేనివారికి ఇవ్వలేదనే ఫిర్యాదులు రాకుండా చూడాలన్నారు. పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. రెవెన్యూ అధికారుల విచారణ అనంతరం గ్రామ సభలు నిర్వహించి అర్హులైన ఇల్లు లేని పేదలను లబ్ధ్దిదారులుగా ఎంపిక చేయాలని సూచించారు.
లబ్ధిదారుల ఎంపికలో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో పెండింగ్ ఉన్న వాటిని, అన్ని గ్రామాల్లో లేని వారిని గ్రామాలకు పిలిపించి వారి వివరాలు సేకరించి సర్వే పూర్తయ్యేలా అధికారులు చొరవ చూపాలన్నారు. జిల్లాలోని కొల్లూరు, తెల్లాపూర్‌లలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద అంగన్వాడీ కేంద్రాలు, అమ్మ ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేసేలా డీఈవో, జిల్లా వైద్యాధికారి, డీడబ్ల్యూవోలు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్మాణం పూర్తయిన ఇండ్లను లబ్ధ్దిదారులకు అందించాలన్నారు. డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లలో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు మాధురి, చంద్రశేఖర్, హౌసింగ్ పీడీ చలపతి, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.