సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 25 : నిమ్జ్‌లో సేకరించిన భూముల్లో రహదారులు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రణాళికలు రూపొందించాలనికలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. నిమ్జ్ పరిధిలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను అనుసంధానిస్తూ మౌలిక సదుపాయాల ప్రణాళిక రూపొందించేందుకు సర్వే కీలకమని స్పష్టం చేశారు. జిల్లాలోని టీజీఐఐసీ భూములు, నిమ్జ్, ఎన్ఐసీడీసీ పరిధిలోని భూముల అభివృద్ధి, సర్వే ప్రక్రియలపై బుధవారం కలెక్టరేట్లో ఎస్పీ పారితోష్ పంకజ్, నిమ్జ్, రెవెన్యూ, టీజీఐఐసీ, సర్వే అధికారులతో కలెక్టర్ సమగ్ర సమావేశం నిర్వహించారు.
ఎలాంటి ఆటంకాలు లేకుండా, శాంతియుత వాతావరణంలో సర్వే ప్రక్రియ నిర్వహించేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుగా అవసరమైన విద్యుత్, నీరు, రహదారుల వంటి సదుపాయాల కల్పనకు సర్వే నిర్వహించి సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. పెండింగ్ సమస్యలు, భూ స్వాధీనం ప్రక్రియలో నెలకొన్న అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ విఠల్, జహీరాబాద్ ఆర్డీవో దేవూజా, నిమ్జ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విశాలాక్షి, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.