సంగారెడ్డి జూలై 7(నమస్తే తెలంగాణ): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)పై సంగారెడ్డి జిల్లా యంత్రాంగంలో కదలిక మొదలైంది. జిల్లాలో ఎన్యుమరేషన్ దరఖాస్తుల పంపిణీ సరిగ్గా సాగటం లేదు. ఉన్నతాధికారులు సైతం సర్ అమలును పర్యవేక్షించడంలేదు. ఇదే అంశాలపై ‘నమస్తే తెలంగాణ’లో మందకొడిగా సర్ శీర్షికతో కథనం ప్రచురితమైంది. నమస్తే కథనంతో జిల్లా యంత్రాంగంలో కదలిక ప్రారంభమైంది. స్వయంగా సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్ రంగంలోకి దిగారు. మంగళవారం పటాన్చెరు నియోజకవర్గంలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, బీఎల్వోల పనితీరు పరిశీలించారు.
దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చిన ఓటర్లతో కలెక్టర్ మాట్లాడి వారి సంశయాలను తీర్చారు. పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూరు డబుల్ బెడ్రూమ్ సముదాయంలో సర్ ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని పరిశీలించారు. అక్కడి తహసీల్దార్, బీఎల్వోతో కలెక్టర్ మాట్లాడి ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ఇతర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎన్యుమరేషన్ ఫారాలు ఓటర్లందరికీ అందేలా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఆ తర్వాత అమీన్‌పూర్‌లోని 130 పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పరిశీలించారు.
పోలింగ్ కేంద్రం పరిధిలోని ప్రతి ఒటరుకు ఎన్యుమరేషన్ ఫారాలు అందేలా బీఎల్వోలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏ ఒక్క ఓటరు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లా అదనపు కలెక్టర్ సంగీత జిన్నారం మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన సర్ దరఖాస్తు ఫారాల పంపిణీ కౌంటర్‌ను పరిశీలించారు. ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేసింది లేనిదీ అధికారులు, బీఎల్వోలను అడిగి తెలుసుకున్నారు. ఓటర్లందరికీ ఎన్యుమరేషన్ ఫారాలు అందజేయాలని అధికారులకు సూచించింది. నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి నాగల్గిద్దలో సర్ అమలు తీరును పరిశీలించారు. అందోల్ ఆర్డీవో రమేశ్‌బాబు చౌటకూరులో సర్ అమలు తీరును పరిశీలించారు. జహీరాబాద్ ఆర్డీవో దేవుజా ఝరాసంగం మండలం చీరేపల్లిలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పరిశీలించారు.
ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీలో అలసత్వం
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)లో భాగంగా ఓటర్లకు అందజేయాల్సిన ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీలో జాప్యం జరుగుతుంది. ఈనెల 24లోగా ఎన్యుమరేషన్ ఫారాలు ఓటర్లు నింపి బీఎల్వోలకు అందజేయాల్సి ఉంటుంది. జిల్లాలోని చాలా మండలాల్లో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ వందశాతం పూర్తి కాలేదు. గడువులోగా ఎన్యుమరేషన్ ఫారాలు ఓటర్లు సమర్పించే అవకాశాలు కనిపించడం లేదు. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీలో బీఎల్వోలు అలసత్వం స్పష్టంగా కనిపిస్తుంది.
బీఎల్వోలు స్వయంగా ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లకు ఎన్యుమరేషన్ దరఖాస్తులు అందజేయడంతో పాటు వాటిని నింపడంలో ఓటర్లకు సహకరించాలి. జిల్లాలో బీఎల్వోలు దరఖాస్తుల పంపిణీ బాధ్యతలను రాజకీయపార్టీలకు చెందిన బూత్‌లెవల్ ఏజెంట్లకు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. న్యాల్కల్ మండలం మీర్జాపూర్ (ఎన్)లో బీఎల్వో మంగళవారం గ్రామానికి రాలేదు. పంచాయతీ కార్యాలయంలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ చేయాల్సి ఉండగా పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో ఫారాల కోసం వచ్చిన ఓటర్లు నిరాశగా తిరిగి వెళ్లిపోయారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది.
ఫారాలు నింపడంలో ఓటర్లకు తప్పని తిప్పలు
ఎన్యుమరేషన్ ఫారాలు నింపడంలో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీఎల్వోలు ఎన్యుమరేషన్ ఫారాలు నింపేందుకు సహకరించేలా చర్యలు తీసుకోవాలని గ్రామీణ ఓటర్లు కోరుతున్నారు. చాలా మంది ఓటర్లకు 2002 ఓటరు జాబితా అందుబాటులో ఉండటం లేదు. 2008లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. దీంతో నియోజకవర్గాల స్వరూపం మారింది. 2002 ఓటరు జాబితా అందుబాటులో లేకపోవటం, ఆన్‌లైన్‌లోనూ లభించక పోవడంతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2002 ఓటరు జాబితా అందుబాటులో లేకపోవటంతో ఎన్యుమరేషన్ ఫారాల్లో కోరుతున్న ఓటరు ఐడీ, పోలింగ్ కేంద్రం తదితర వివరాలు నింపటానికి ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేయటానికి సైతం ఓటర్లు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.