సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 17: జిల్లాలో మన ఊరు-మన బడి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్ రాజర్షి షాతో కలిసి మన ఊరు-మన బడి పనుల పురోగతి, ఎఫ్టీవోల జనరేట్, మోడల్స్ స్కూల్స్ పురోగతి తదితర అంశాలపై కలెక్టర్ మంగళవారం సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పనులు పూర్తయిన పాఠశాలలకు పేయింటింగ్ పూర్తి చేయాలన్నారు. ఆయా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన ఉండేలా చర్యలు చేపట్టాలని సంబంధిత ఎంఈవోలకు సూచించారు. మన ఊరు-మన బడిలో చేపట్టిన మోడల్స్ స్కూళ్లను ప్రారంబించేందుకు అన్ని హంగులతో సిద్ధం చేయాలని అధికారును ఆదేశించారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా, నాణ్యతతో చేపడుతూ సత్వరమే పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
వివిధ నియోజకవర్గాల్లో పనులు నత్త నడకన సాగుతున్నాయంటూ ఈఈలు, డీఈల పనితీరుపై కలెక్టర్ అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తయిన పనులకు వెనువెంటనే ఎఫ్‌టీవో (ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్) అప్లోడ్ చేయాలని స్పష్టం చేశారు. అయితే మన ఊరు-మన బడిలో చేపట్టిన పాఠశాలల పేయింటింగ్ విషయంలో ప్రభుత్వం సూచించిన కలర్ కోడ్ రంగులు వేయాలని కలెక్టర్ మరోసారి స్పష్టం చేశారు. సమావేశంలో డీఈవో రాజేశ్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.