
ప్రస్తుతం మార్కెట్లో కూరగాయలు మొదలు.. పండ్లు, ఆకుకూరలు చివరకు వరి ధాన్యం ఇలా ఏది కొనాలన్నా అధిక రసాయన ఎరువులతో పండించినవే దొరుకుతున్నవి. అధిక దిగుబడుల సాధన, ఆశకు రైతులు విరివిగా రసాయన ఎరువులు వినియోగంతో భూసారం దెబ్బతింటున్నది. ఫలితంగా భూమి రసాయన ఎరువులకు అలవాటు పడి ప్రతి ఏడాది పెట్టుబడులు పెరుగుతున్నాయి.ఎరువులు చల్లనిదే పంట రావడం లేదు.. అదే సమయంలో రసాయన ఎరువులతో పండిన ఆహార పదార్థాలను తీసుకుంటున్న ప్రజలు వివిధ వ్యాధుల బారిన పడుతున్నారు.దీనికి పరిష్కారం కోసం తనవంతుగా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఒబులాపూర్ అనుబంధ గ్రామం శంకరాయకుంటకు చెందిన యువరైతు మాకు మహేశ్ వినూత్నంగా ఆలోచన చేశాడు. భూసారం దెబ్బతినకుండా, ప్రజలకు బలమైన ఆహారం అందేలా దేశవాళి పంటలైన కాలాబట్టి (బ్లాక్‌రైస్), నవారా (రెడ్‌రైస్) సాగుకు శ్రీకారం చుట్టి సాటి ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతడిని చిన్నకోడూరు ఎంపీపీ కూర మాణిక్యరెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, రైతులు ప్రశంసిస్తున్నారు.
చిన్నకోడూరు, ఆగస్టు 9 : రైతు కుటుంబంలో పుట్టిన మాకు మహేశ్‌కు చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ఎంతో మక్కువ. అటు విద్యాభ్యాసం కొనసాగిస్తూనే సాగులోనూ మెలకువలు నేర్చుకున్నాడు. 2013లో ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) చదివిన మహేశ్, 2014 బీఈడీ సైతం పూర్తి చేశాడు. సిద్దిపేటలోని ఓఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తూ విద్యార్థులకు బోధన చేస్తున్నాడు. ఇటు వ్యవసాయంలోనూ ప్రత్యేకతను చాటుతున్నాడు. ఎవరైనా ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ఉందంటే కాలక్షేపం చేస్తూ సమయం వృథా చేసుకుంటున్నారు. కానీ, మహేశ్ అలా కాకుండా సాంకేతికతను చక్కగా సద్వినియోగం చేసుకొని, అధిక ఆదాయం, ఆరోగ్యానికి మేలు చేసే రకాలైన కాలాబట్టి, నవారా రకం సాగు గురించి యూట్యూబ్‌లో సెర్చ్ చేశాడు. ఆలోచన వచ్చిందే తడువుగా నల్లగొండ నుంచి విత్తనాలు తెప్పించి సాగుకు శ్రీకారం చుట్టాడు. అటు బోధన.. ఇటు సాగు రెండింటిలోనూ మేటిగా రాణించి ఆదర్శంగా నిలిచాడు.
నేటి తరుణంలో ఏ పంటలు పండించాలన్న అధిక పెట్టుబడులు పెట్టాల్సిందే.. మహేశ్ పెట్టుబడి భారం తగ్గించుకునేలా సేంద్రియ వ్యవసాయానికి పూనుకున్నాడు. తానే స్వయంగా సేంద్రియ ఎరువు, వేస్ట్ డీ కంపోజర్, ఆర్గానిక్ ఐఎంసీ వస్తువులతో సాగు చేపట్టాడు. 200 లీటర్ల నీటిలో 30 గ్రాముల వేస్ట్ డీ కంపోజర్ వేసి 2 కిలోల బెల్లం కలిపి రోజు ఉదయం, సాయంత్రం కలియబెట్టాలి. ఇలా ఆరు రోజులకు ఘాటైన వాసనతో వేస్ట్ డీ కంపోజర్ తయారవుతుంది. 200 లీటర్ల ఈ ద్రావణాన్ని ఒక ఎకరాకు వాడవచ్చు. దీనిని పొలంలో చల్లడం ద్వారా పనికి రాని గడ్డి, ఇతర వ్యర్థ పదార్థాలు కానీ, కుళ్లిన వరి మొక్కకు బలాన్నిస్తాయి. ఒక్కసారి తయారు చేసిన ద్రావణం నుంచి 10 లీటర్లు తీసుకుంటే మరోసారి 200 లీటర్ల వరకు తయారు చేయవచ్చు. 10 లీటర్లు తీసుకొని దానికి 190 లీటర్ల నీరు కలిపి మళ్లీ 2 కిలోల బెల్లం వేసినట్లయితే మళ్లీ 200 లీటర్ల వేస్ట్ డీ కంపోజర్ తయారవుతుంది. ఇలా మూడేండ్ల వరకు ఇలా తయారు చేసుకునే అవకాశం ఉన్నది. ఇలాంటి పద్ధతుల్లో పెట్టుబడి భారాన్ని తగ్గించి పంట పండించాడు.
అందరూ రైతులు ఎప్పటి మాదిరిగానే షిష్టుపోర్, 1010, కావేరి, మినలు దొడ్డురకం వరిసాగు చేయగా, మహేశ్ మాత్రం దేశవాళీ వరి రకం నలుపు, ఎరుపు రకం వరి సాగుచేశాడు. ఈ పంటకు తెగుళ్లు సోకక పోవడంతో పాటు గాలివానకు నేలకు ఒరిగిపోయే గుణం తక్కువగా ఉంటుంది. 4-5 సెం.మీ పొడుగు పెరుగుతుంది. 135 రోజుల నుంచి 145 రోజుల వరకు పంట సాగుకాలం. కాగా, ఎకరాకు 15-20 క్వింటాళ్ల దిగుబడి సాధించాడు. మొట్టమొదట సారిగా చేపట్టిన సాగు మహేశ్‌కు మంచి ఫలితమిచ్చింది. నల్ల బియ్యం కిలోకు రూ.350-450 వరకు ధర పలుకుతున్నాయి. అతడికి ఖర్చులు పోనూ ఎకరాకు రూ.65 నుంచి రూ.80 వేల వరకు ఆదాయం మిగిలింది.
మొదటగా గిన్నె లేదా కుండ తీసుకొని గ్లాస్ బ్లాక్ బియ్యానికి కొద్దిపాటి నీళ్లతో రెండు సార్లు కడగాలి. కడిగిన బియ్యానికి మూడు గ్లాస్‌ల నీరు పోసి 5 నుంచి 6 గంటలు నానబెట్టాలి. తరువాత గిన్నెను మంటపై పెడితే 15 నుంచి 20 నిమిషాల్లో రెడీ అవుతుంది. ఒక వ్యక్తికి 80 నుంచి 100 గ్రాముల బియ్యం సరిపోతుంది.
అంటోసైనిన్ అనే వర్ణ ద్రవ్యం ఉండటంతో బియ్యం నలుపు రంగులో ఉంటాయి.
బ్లాక్‌రైస్‌లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది.
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.
బీ6, బీ12, విటమిన్ బీ, విటమిన్ ఈ, కాల్షియం, మెగ్నీషియం, జింకు, ఇనుము, నియాన్, పీచు పదార్థాలపోషకాల మోతాదు ఎక్కువ.
క్యాన్సర్ నిరోధక పదార్థాలు (బ్లాక్‌రైస్)లో ఎక్కువ ఉన్నాయని పరిశోధనలో ఇప్పటికే తేలింది.
బియ్యం గంజి తల వెంట్రుకలకు పట్టిస్తే బలంగా, అందంగా దృఢంగా ఉంటాయి. ముఖానికి మాస్క్‌గా రోజు వేసుకుంటే మచ్చలు,మొటిమలు తగ్గుతాయి.
బ్లాక్‌రైస్ కంటి వ్యాధులను నయం చేస్తుంది.
నేడు వివిధ రకాల జబ్బులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో అందరికీ రోగనిరోధకశక్తి అవసరం. ఎన్నో పోషక విలువలు గల బ్లాక్‌రైస్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బులను నివారించే గుణం ఇందులో ఉంది. రైతులూ కూడా ఎప్పటికీ ఒకేరకం వరి సాగు కాకుండా దేశవాళీ రకం కాలాబట్టి సాగు చేసి దిగుబడులు సాధించి లాభాలు గడించాలని కోరుకుంటున్నా. కాలాబట్టి సాగుతో మంచి లాభం ఉంది. బ్లాక్‌రైస్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.. అవసరమున్న వారికి ఆన్లైన్లోనే అందిస్తున్నా. యూట్యూబ్ mahesh maku లేదా 9959648675 నంబరులో నేరుగా సంప్రదించవచ్చు.