
పగలు ఆటోడ్రైవర్ డ్యూటీ, రాత్రి ఇండ్లలో చోరీ
ఇద్దరు నిందితులను పట్టుకున్న పట్టణ పోలీసులు
వివరాల వెల్లడించిన సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ
కంది, సెప్టెంబర్ 8 : పగలంతా ఆటో నడుపుతూ ప్యాసింజర్లను వారి గమ్యస్థలాలకు చేర్చుతుంటారు. రాత్రి వారిలో ఉన్న దొంగ మేలుకుంటాండు. ఇంకేముందు తాళం వేసిన ఇండ్లు కనిపిస్తే చాలు తాళం పగలగొట్టు లూటీ చేసి జల్సాలు చేస్తుంటారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 41 దొంగతనాలకు పాల్పడ్డారు. ఓ ఇంట్లో చోరీ చేస్తున్న క్రమంలో అడ్డుగా వచ్చిన ఓ వృద్ధురాలిని సైతం హత్య చేశారు. గతంలో చోరీల కేసులో ఆ ఇద్దరు దొంగలు జైలుకు వెళ్లి వచ్చారు. అయినా వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. పోలీసులను సైతం ముప్పతిప్పలు పెడుతూ యథేచ్ఛగా చోరీలకు పాల్పడుతున్న నిందితులను సంగారెడ్డి పట్టణ పోలీసులు ఎట్టకేలకు బుధవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సంగారెడి జిల్లా కంది మండలం కలివేముల గ్రామానికి చెం దిన లాగుల రాజుగౌడ్ (36), హత్నూర మం డలం గోవింద్రాజుపల్లి గ్రామానికి చెందిన చాకలి గోపాల్ (26) ఇద్దరు ఆటోడ్రైవర్లు. వీరు కొన్నేండ్లుగా పగలు ప్యాసింజర్ ఆటోలు నడుపుతూ జల్సాలకు అలవాటు పడి రాత్రి తాళం వేసిన ఇండ్లను లూటీ చేస్తున్నారు. గతంలో దొంగతనం కేసులో పోలీసులు వారి ని అరెస్టు చేసి జైలు పంపించినా వీరిలో ఏ మాత్రం మార్పు రాలేదు. సంగారెడ్డి పట్టణం శాంతినగర్‌కు చెందిన సుల్తాన్షేక్(60) తన ఇంట్లో 09-05-2021 దొంగల చేతిలో తీవ్రంగా గాయపడింది. ఆమె చికిత్స పొందుతూ 07-07-2021న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో మృతి చెం దింది. ఈ మేరకు పోలీసులు హత్య కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బుధవారం తెల్లవారుజామున సంగారెడ్డిలోని ఓడీఎఫ్ కాలనీలో ఈ ఇద్దరు నిందితులు చోరీకి యత్నించేందుకు తిరుగుతుండగా పోలీసులకు అనుమానం వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుల్లో ఒకడైన చాక లి గోపాల్ గత నెల 27న వసంత్‌నగర్ కాలనీలో ఓ ఇంట్లో పట్టు చీరెలు, వెండి వస్తువులు, రూ.5 వేలు చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇటీవల సుల్తాన్షేక్ను కూడా ఇనుపరాడ్‌తో కొట్టి తీవ్రంగా గాయపర్చి ఆమె బీరువాలో ఉన్న రూ.20 వేల నగదు ఎత్తుకెళ్లినట్టు నిందితులు ఒప్పుకున్నారు.
నిందితులిద్దరిపై మొత్తం 41 చోరీ కేసులు..
నిందితులైన రాజుగౌడ్, గోపాల్ సంగారెడ్డి పట్టణంతోపాటు సంగారెడ్డి రూరల్, కొండాపూర్, మునిపల్లి, నర్సాపూర్, శంకర్‌పల్లిలో పలు చోరీలకు పాల్పడ్డారు. రాజుగౌడ్‌పై 29 చోరీ కేసులు, చాకలి గోపాల్ మీద 12 చోరీ కేసులు ఉన్నాయని డీఎస్పీ వెల్లడించారు. నిందితుల నుంచి రూ.20 వేల నగదుతోపాటు వెండి పట్టుగొలుసు జత, మూ డు పట్టుచీరెలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్టు ఆయన తెలిపారు. ఈ కేసు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న పట్టణ సీఐ రమేశ్, ఏఎస్సై శ్రీనివాస్‌రెడ్డి, కానిస్టేబుళ్లు అన్వర్‌పాషా, శంకరయ్య, షఖీరొద్దీన్ను డీఎస్పీ అభినందించారు.