తెలంగాణ పచ్చబడితేనే వర్షాలు బాగా పడుతాయని సీఎం కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేశారు. ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని అమలు చేస్తూ ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తున్నారు. ఇప్పటి వరకు పలు విడుతల్లో నిర్వహించిన హరితహారం విజయవంతం కావడంతో పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. సంగారెడ్డిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి, సంరక్షించడంతో పట్టణమంతా ఆకుపచ్చగా దర్శనమిస్తూ ఆకట్టుకుంటున్నది.
సంగారెడ్డి, అక్టోబరు 5: తెలంగాణ ప్రభుత్వం పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నది. ఏటా ప్రభుత్వం జిల్లాల వారీగా లక్ష్యాలు నిర్దేశించి హరితహారంలో మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలను అప్పగిస్తున్నది. గ్రామస్థాయిలో పంచాయతీ పాలక మండలి, ప్లాంటేషన్ అడవులు, డీఆర్డీవో అధికారుల పర్యవేక్షణలో నాటిన మొక్కలను కాపాడుతున్నారు. మొక్కలు చెట్లుగా పెరిగి పచ్చని వాతావరణం సంతరించుకున్నాయి. సంగారెడ్డి పట్టణంలో పోతిరెడ్డిపల్లి నుంచి కలెక్టరేట్ ముందుగా ఎస్పీ బంగ్లా వరకు పచ్చనిహారంలా పట్టణవాసులను ఆహ్లాదపరుస్తున్నాయి. రాత్రివేళల్లో విద్యుత్ కాంతులు తోడుకావడంతో మొక్కలు చూడముచ్చటగా అందంగా కనువిందు కలిగిస్తున్నాయి. నిత్యం వందలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థాలకు వెళ్లడానికి బస్టాండ్లకు వచ్చే ప్రయాణికులకు ప్రయాణ ప్రాంగణం, ప్రభుత్వ అతిథిగృహంలో నాటిన మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ప్రభుత్వ ఐటీఐలో రెండేండ్ల కితం నాటిన మొక్కలు పెరిగి పెద్దవై చిట్టడవిని తలపిస్తున్నాయి. సంగారెడ్డి పట్టణంలో ప్రయాణించే పట్టణవాసులు, జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్‌కు వచ్చే వారికి ఆహ్లాదకర పరిస్థితులున్నాయి.
చెట్టును నేను…
హరితహార మణిహారపు తరగని తళుకును నేను
పుట్టినపుడు ఏడ్వకుండా ఊపెడు ఊయల నేను
కట్టెగ నువ్వు మారినప్పుడు కాల్చేడు కట్టెను నేను
అలసిసొలసి మీరు రాగ సేదదీర్చు కుర్చి నేను
కొలువులో నువ్వు చేరినప్పుడు విలువగు పత్రమును నేను
చెట్టును నేను…
ప్రాణికోటికంతటికీ బ్రతుకు గాలినందింతును
జానెడు పొట్టను నింపగ ఫలములెన్నో తినిపింతును
జనగణముల రణగొనధ్వని కాలుష్యం తగ్గింతును
కనువిందుగ వనశోభతో మనసులనే మురిపింతును
చెట్టును నేను…
నీటిమబ్బు కరిగి వాన కురవగానే సాయపడుదు
కోటిజనుల నా నీడన నిలువగనే మురిసిపోదు
మాట అంట నొచ్చుకోక మనిషి కన్న మిన్న నేను
సాటివారి సేవకు సర్వ సమర్పణజేతేను
చెట్టును నేను…
నేటి మొక్క రేపటి చెట్టన్న మాట మరవకండి
రేపటి తరముల బతుకగా నేడు మొక్కనాటండి
పట్టుబడి మొక్కనాటి చెట్టులాగ పెంచండి
పచ్చనైన ప్రకృతి ఒడి పరవశిస్తు తిరగండి
చెట్టును నేను…