ఝరాసంగం, నవంబర్ 9: పదిహేనేండ్ల వయస్సులో పుట్టినూరు, సొంతవాళ్లను, బంధుమిత్రులను వదిలిపెట్టి వెళ్లిన వ్యక్తి 50 ఏండ్ల తర్వాత తిరిగి తన ఆప్తులను వెతుక్కుంటూ సొంతూరికి వచ్చాడు. వివరాలు.. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని బొప్పనపల్లికి చెందిన కమ్మరి నాగప్ప, మోహనమ్మ దంపతులకు నలుగురు కుమారులు, కుమార్తె సంతానం. వారిలో చిన్నవాడైన సంగన్న 50 ఏండ్ల క్రితం తన 15వ ఏట నుంచి గ్రామాన్ని విడిచి వెళ్లిపోయాడు. ఆ వయసులో తల్లిదండ్రులు మరణించడం, ఇద్దరు సోదరులు హైదరాబాద్లో ఓ కంపెనీలో పనిచేసేవారు. అన్న గ్రామంలో ఉండేవారు. సోదరికి పెండ్లి కావడంతో సదాశివపేటలో ఉండేది.
వారి వద్ద కొద్దిరోజులు ఉండి ఆ తర్వాత సంగన్న మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా మలేగావు తాలూకాలోని చంద్రగిరికి వెళ్లాడు. చంద్రగిరిలో మహిళను వివాహం చేసుకోగా, సంగన్నకు నలుగురు సంతానం కలిగారు. అక్కడే సొంతింటిని నిర్మించుకుని జీవనం కొనసాగిస్తున్నాడు. అప్పటి నుంచి గ్రామానికి రాలేదు. కుటుంబసభ్యులకు, బంధుమిత్రులతో టచ్లో లేడు. తీరా ఆదివారం బొప్పనపల్లికి సంగన్న తిరిగి రావడంతో గ్రామస్తులు కొద్దిసమయం గుర్తుపట్టలేక పోయారు. ఆ తర్వాత కుటుంబీకులు, బంధువులు సంగన్నను తమవాడే అని గుర్తించారు. అనంతరం సంగన్నను గ్రామస్తులు సన్మానం చేశారు.