రామాయంపేట/చిన్నశంకరంపేట/ నర్సాపూర్/ వెల్దుర్తి/ చేగుంట, అక్టోబర్ 18: తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగను స్నేహ డిగ్రీ కళాశాల విద్యార్థినులతో కలిసి జరుపుకోవడం ఆనందంగా ఉందని, రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఒక్కచోట చేరి ఆడబిడ్డలతో పాటు బతుకమ్మ సంబురాల్లో భాగమవ్వడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని రామాయంపేట తహసీల్దార్ రజనీకుమారి, కమిషనర్ ఉమాదేవి అన్నారు. బుధవారం రామాయంపేట పట్టణంలోని స్నేహ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో కళాశాల యాజమాన్యం బతుకమ్మల పోటీలను నిర్వహించింది.
పోటీలలో ప్రతిభను చాటిన వారికి బహుమతులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ మన తెలంగాణ రాష్ట్ర పండుగ ఈ పండుగను ఆడపిల్లలు ఎవ్వరూ మరచిపోవద్దని, గత ప్రభుత్వాల బతుకమ్మ పండుగను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, కవిత స్ఫూర్తితో బతుకమ్మకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. మన సంస్కృతి సంప్రదాయలను విద్యార్థులకు తెలియజేసే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహిస్తున్నామని స్నేహ కళాశాలల వ్యవస్ధాపకుడు వలిశెట్టి సత్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ స్వప్న, విద్యార్థులతో పాటు వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
Medak6
రామాయంపేట పట్టణంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం పట్టణంలోని వెంకటేశ్వర కాలనీ, మహంకాళి అమ్మవారి దేవాలయంలో, బీసీ కాలనీ, రెడ్డి కాలనీ దుర్గమ్మ బస్తీ, కేసీఆర్ కాలనీ తదితర ప్రాంతాల్లో బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా జరుపుకుంటున్నారు. మహిళలు బతుకమ్మలను తంగేడు, గునుగు పూలతో పేర్చి ఆడిపాడుతున్నారు. అనంతరం బతుకమ్మలను గౌరమ్మ పాటలు పాడి చెరువుల్లో నిమజ్జనాలు చేశారు. మహంకాళి ఆలయంలో మహిళా భక్తులు కోలాటాల ఆటలను ఆడారు. మండలంలోని ఆర్.వెంకటాపూర్, అక్కన్నపేట, తొనిగండ్ల, లక్ష్మాపూర్, కాట్రియాల, దంతెపల్లి, పర్వతాపూర్, ఝాన్సీలింగాపూర్, కోనాపూర్ తదితర గ్రామాల్లో బతుకమ్మ వేడుకలను మహిళలు జరుపుకుంటున్నారు.
చిన్నశంకరంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో బుధవారం మహిళలు బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మలని పేర్చి గ్రామంలో ప్రధాన వీధుల వద్ద మహిళలు బతుకమ్మలు ఆడారు. అనంతరం బతుకమ్మలను స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేశారు. చిన్నశంకరంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు.
నర్సాపూర్ పట్టణంలోని ఎల్లంకి డిగ్రీ, ఇంటర్మీడియట్ ప్రైవేట్ కళాశాలలో బతుకమ్మ సంబురాలు బుధవారం ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అశోక్, విద్యార్థులు పాల్గొన్నారు.
బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని మండలంలోని వెల్దుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి కళాశాల ఆవరణలో బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ సందడి చేశారు. అనంతరం బతుకమ్మలను స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు.
చేగుంట, నార్సింగిలో బతుకమ్మ వేడుకలు కోలాహలంగా సాగుతున్నాయి. రంగురంగు పూలతో తయారు చేసిన బతుకమ్మలను ఒక్కచోటికి చేర్చి.. రామరామ ఉయ్యాలో.. జయరామరామ ఉయ్యాలో, ఒక్కేసి పువ్వేసి చందమామ.. అంటూ పాటలు పాడుతూ సందడి చేశారు. అనంతరం ఊర చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. చేగుంట ప్రభు త్వ కళాశాలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుపుకున్నా రు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హరిప్రసాద్‌నాయుడు, అధ్యాపకులు ప్రమీలరాణి, లైబ్రేరియన్ గ్రేస్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ప్రమోద్‌కుమార్, స్వర్ణలత, ఫర్జానా పాల్గొన్నారు.