యాసంగి సాగుకు సిద్ధమవుతున్న వేళ అన్నదాత ఇంటికి ‘రైతుబంధు’వస్తున్నది. ఈ నెల 28 నుంచి నేరుగా రైతుల ఖాతాకు చేరనున్నది. ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లా రైతుల వివరాలను యంత్రాంగం సేకరించింది. ఇప్పటి వరకు తొమ్మిది విడతలుగా ఉమ్మడి మెదక్ జిల్లా రైతులకు సాయం అందింది. ప్రస్తుతం పదో విడతకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. తొమ్మిది విడతల్లో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని 67,93,621 మంది రైతులకు రూ.7,055. 87 కోట్లు సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. సిద్దిపేట జిల్లాలో 23,12,516 రైతులకు రూ. 2,504.58 కోట్లు, మెదక్ జిల్లాలో 19,69,954 రైతులకు రూ.1,642.98 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 25,11,151 రైతులకు రూ. 2,908.31 కోట్లు వేసింది. సాగుకు ముందే యాసంగి డబ్బులను ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాలో వేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
సిద్దిపేట, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతుకు వెన్నుదన్నుగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారు. రైతులు అడగకముందే పంట పెట్టుబడి సాయం అందిస్తున్నారు. సాగు సమయం వచ్చిందంటే చాలు పెట్టుబడి సాయం ఎట్లా అని దిగులు ఉండే.. ఇవాళ ఆ రంది రైతులకు లేదు. గత ప్రభుత్వాలు ఇలా పెట్టుబడి సాయం ఇవ్వకపోవడంతో మిత్తి వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి సాగు చేసేవారు. తీరా పంట చేతికి వచ్చే సరికి వడ్డీ వ్యాపారుల మిత్తీలకు పంట సరిపోయేది. దీంతో రైతులు అప్పుల పాలయ్యేవారు. ఇప్పుడు రైతులకు అలాంటి పరిస్థితులు లేవు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధుతో సాఫీగా సాగు చేసుకుంటున్నారు. రైతులకు పెట్టుబడి ఇబ్బందులు లేకుండా సాగుకు ముందే యాసంగి రైతుబంధు డబ్బులను ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాలో వేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటి వరకు తొమ్మిది విడతలుగా రైతుబంధును సీఎం కేసీఆర్ అందించారు.
ప్రస్తుతం అందించే రైతుబంధు పదోది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో కలిపి తొమ్మిది విడతల్లో 67,93,621 మంది రైతులకు రూ.7,055. 87 కోట్లు రైతుల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. సిద్దిపేట జిల్లాలో 23,12, 516 రైతులకు రూ. 2,504.58 కోట్లు, మెదక్ జిల్లాలో 19,69,954 రైతులకు రూ.1,642.98 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 25,11,151 రైతులకు రూ. 2,908.31 కోట్లు వేశారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటిలాగే ఒక ఎకరం నుంచి మొదలుకొని పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతుకు సంక్రాంతి పండుగలోగా రైతుబంధు డబ్బులను వేయనున్నారు. ఆ దిశగా అధికారులు ఆ ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టాదారు పాస్ పుస్తకం ఉండి ఇంకా ఎవరైనా రైతుల వివరాలు నమోదు కాకపోతే వారి వివరాలను నమోదు చేసుకుంటారు. ప్రతి రైతుకు పంట పెట్టుబడి సాయం అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులకు ఈ నెల 28వ తేదీ నుంచి పదో విడత రైతుబంధు రైతుల వ్యక్తిగత ఖాతాలో పడనున్నది. గత వానకాలం మాదిరిగానే ఒక ఎకరం నుంచి ప్రారంభమై రెండు ఎకరాలు, మూడు ఎకరాలు.. ఇలా రోజురోజుకూ పెరుగుతూ సంక్రాంతి పండుగ లోగా రైతులందరికీ రైతుబంధు డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నది. జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు ఆ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మే 2018 లో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు.
పథకం ప్రారంభంలో ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండు పంటలకు ఏడాదికి రూ.8 వేలను అందించారు. గత శాసన సభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఎకరాకు రూ. 5 వేల చొప్పున రెండు పంటలకు ఏడాదికి రూ.10 వేలను అందిస్తున్నారు. ప్రస్తుత యాసంగి పంటకు అందించే రైతుబంధు సాయం పదోది. కాగా, కొత్తగా భూములు కొన్న రైతులు రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్తగా భూమి కొని, పట్టాదారు పుస్తకం, లేదా ఆఫీసు కాపీ వచ్చిన రైతులు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి తమ దరఖాస్తును అందించాల్సి ఉంటుంది. రైతుబంధు డబ్బులను ఎరువులు, విత్తనాలు, దున్నకం తదితర వాటికి పెట్టుబడికి రైతులు ఉపయోగిస్తున్నారు.
రైతులకు ఎలాంటి చింత లేకుండా సకాలంలో రైతుబంధు అందిస్తున్నది. గతంలో ఏ ప్రభుత్వాలు ఇవ్వని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయాన్ని అందించి రైతాంగాన్ని ఆదుకుంటున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థికంగా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించాల్సిన పెట్టుబడి సాయాన్ని అందించి, రైతులకు సీఎం కేసీఆర్ భరోసానిస్తున్నారు. స్వయంగా రైతు బిడ్డ, రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా రైతుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతున్నది. రైతుబీమా పథకంతో రైతు కుటుంబాల్లో భరోసా నింపింది. రైతు పండించిన ప్రతి గింజా కొని, రైతాంగానికి మద్దతు ధర కల్పిస్తున్నది. వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లే తిప్పలు తప్పడంతో రైతులు సంతోషంగా ఉన్నారు.