గజ్వేల్, జూన్ 1: కరెంట్ తిప్పలైతంది సారూ… కరెంట్ సరిగ్గా ఇస్త్తలేరు… ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తాలేదని సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం తునికిమక్తా గ్రామానికి చెందిన రైతు పసుల కిష్టయ్య మాజీమంత్రి హరీశ్‌రావుతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. తునికిమక్తా గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త చాకలి కనకయ్య మేలో ఎల్కతుర్తిలో జరిగిన రజతోత్సవ సభకు వెళ్లి తిరిగి వస్తూ ప్రమాదంలో మృతిచెందాడు.
ఆ కుటుంబానికి రూ.5లక్షల చెక్కును అందజేసిన అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతుండగా, అదే గ్రామానికి చెందిన రైతు పసుల కిష్టయ్య కరెంట్ సక్కగా ఇయ్యక మోటర్లు కాలిపోతున్నాయని, కేసీఆర్ ఉండగా గిన్నిసార్లు పోలేదని చెప్పుకొచ్చాడు. నీళ్లున్నయని బోరేసుకొని వరి ఎసుకుంటే, కరెంట్ వచ్చిపోవుడుకు మోటర్లు కాలి పోతున్నయని, సింగిల్ ఫేజ్ ఇచ్చి మళ్ల కొద్దిసేపటికే త్రీఫేజ్ ఇచ్చే సరికి మోటర్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు.
మోటర్లు కాలిపోతే రైతులు ఎడుస్తుర్రని, రోజుకు నాలుగైదు సార్లు కరెంట్ పోతున్నదని, కేసీఆర్ ఉండగానే బాగుండే, ఇప్పుడేమో కరెంట్ తిప్పలకు రైతులు ఆగం అవుతున్నరని హరీశ్‌రావుతో రైతు గోడువెళ్లబోసుకున్నాడు.