సిద్దిపేట/చిన్నకోడూరు, జూలై 19: కాళేశ్వరం జిల్లాల కోసం రైతన్న కదం తొకాడు.. ప్రాజెక్టులు నింపాలంటూ చేపట్టిన పాదయాత్రకు రైతులు స్వచ్ఛందంగా భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు, యువకులు, రైతులు, రైతు కూలీలు భారీగా తరలి రావడంతో పాదయాత్ర ఆద్యంతం ఉత్సాహభరితంగా కొనసాగింది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన మహా రైతు పాదయాత్ర విజయవంతమైంది. పాదయాత్ర 16 కిలోమీటర్లు సాగింది. అన్నపూర్ణ సాగర్ నుంచి రంగనాయక సాగర్ వరకు ఉద్యమం తరహాలో సాగింది. పాదయాత్రలో పాల్గొన్న రైతులకు గులాబీ సైన్యం సంఘీభావం తెలుపుతూ ముందుకు సాగింది.

ఈ సందర్భంగా రైతులు మా రక్తాన్ని ధారపోస్తాం.. కాళేశ్వరం నీళ్లు ఇవ్వు … రక్త పిపాసి రేవంత్‌రెడ్డి కాసుకో అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ పాదయాత్రలో పాల్గొన్నారు. చిన్నకోడూరు మండలం అల్లిపూర్ అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయక సాగర్ వరకు రైతు మహాపాదయాత్రలో రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాళేశ్వరం మోటర్లు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలని డిమాండ్ చేశారు. డప్పు చప్పుళ్లు.. నృత్యాలు చేస్తూ రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కళాకారులు ఆటపాటలు, డిల్లెం బల్లెం డోలు దెబ్బకళాకారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. జల పందిళ్లతో పాదయాత్రకు మద్దతుగా నిలిచారు. ఉదయం 8:30 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర, మధ్యాహ్నం 3 గంటలకు పెద్దకోడూరుకు చేరుకుంది.

నీటి కోసం రైతులు చేపట్టిన పాదయాత్రకు దారి వెంట పంట పొలాల్లో ఉన్న రైతులు ఎదురేగి స్వాగతం పలికారు. మహిళలు, కళాకారులు పాదయాత్రను ఆటపాటలతో హోరెత్తించారు మళ్లీ కేసీఆర్ వస్తేనే మనకు, మన బతుకులు బాగుపడతాయని పలువురు రైతులు పేర్కొన్నారు. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు పెద్దకోడూరు వద్ద రైతులను కలిసి సంఘీభావం ప్రకటించారు. అకడి నుంచి రంగనాయక సాగర్ వరకు రైతులతో కలిసి ఆయన పాదయాత్రలో పాల్గొన్నారు. ‘మీకు మా రక్తం ఇస్తాం.. మాకు కాళేశ్వర జాలాలు ఇవ్వు రేవంత్‌రెడ్డి’ అని రంగనాయక సాగర్ వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్‌పై హరీశ్‌రావు సంతకం చేశారు.