సంగారెడ్డి, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లపై తొందరపడి కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాలు పెట్టొద్దని డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ కోరారు. శనివారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమీవేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు పెట్టేందుకు అవసరమైన గడువును నాలుగేండ్లుగా పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేసిందని, త్వరలోనే రాష్ట్ర గవర్నర్ అనుమతితో చట్టం అమలులోకి రానున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కౌన్సిలర్లు చైర్మన్లు, వైస్చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు పెట్టేందుకు సిద్ధం కావటం సరికాదన్నారు. మున్సిపాలిటీల్లో ఎక్కడైనా సమస్యలుంటే ఆర్థిక, వైద్యారోగ్యశాఖ, జిల్లా మంత్రి హరీశ్‌రావు, నియోజకవర్గ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని కోరారు.
బీఆర్ఎస్ అధిష్టానం అనుమతులు తీసుకోకుండా అవిశ్వాస తీర్మానాలు పెట్టేందుకు కొంతమంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు సిద్ధం కావటం పార్టీని దిక్కరించటమేనన్నారు. అలాంటి తీర్మానాలకు మద్దతు పలకొద్దని సంగారెడ్డి జిల్లాలోని మున్సిపల్ కౌన్సిలర్లను కోరారు. మున్సిపల్ చట్టం నిబంధనల మేరకు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాసం పెట్టాలనుకుంటే కౌన్సిల్‌లోని సగం మంది సభ్యులు మద్దతు, 50 శాతంకుపైగా కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ ఎదుట ప్రత్యక్షంగా హాజరై తీర్మానంపై సంతకాలు చేయాల్సి ఉంటుందన్నారు. కలెక్టర్ ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, వారి సూచనలకు, మున్సిపల్ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. సంగారెడ్డి జిల్లాలోని మున్సిపల్ చైర్మన్లు, వైస్చైర్మన్లపై నిబంధనలకు అనుగుణంగా అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. దీనిని కౌన్సిలర్లు గుర్తించాలని సూచించారు.