దౌల్తాబాద్, సెప్టెంబర్ 18: విద్యార్థులను తీసుకొచ్చే ఆర్టీసీ బస్సు బురదలో దిగబ డింది. మండలంలోని కోనాపూర్ నుంచి దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలకు విద్యార్థులు ఆర్టీసీ బస్సులో విద్యను అభ్యసించడానికి ప్రతిరోజు వస్తారు. గురువారం కోనాపూర్ నుంచి దౌల్తాబాద్‌కు విద్యార్థులను బస్సులో ఎకించుకొని బస్సు బయలుదేరింది. గ్రామ శివారులోకి రాగానే కెనాల్ బ్రిడ్జి వద్ద బస్సు బురదలో దిగబడడంతో బస్సులో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.
ఆర్టీసీ డ్రైవర్ విద్యార్థులను బయటకి దించారు. బురదలో దిగబడిన బస్సును బయటికి తీయడానికి డ్రైవర్ ఎంత ప్రయత్నించినా బస్సు కదలలేదు. విద్యార్థులు, కండక్టర్, డ్రైవర్ అవస్థ పడ్డారు. గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్‌ను రప్పించి ట్రాక్టర్ సహాయంతో బస్సును బురదలో నుంచి బయటకి లాగారు. రోడ్డు ఇలా ఉంటే మా చదువులు ఎలా సాగుతాయని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంతల మయంగా మారిన రోడ్డును అధికారులు, ప్రజాప్రతినిధులు, పట్టించుకోకపోవడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.