రామచంద్రాపురం, ఫిబ్రవరి 3: బహుజనులందరూ చైతన్యవంతులుగా ఉండి, హక్కుల కోసం పోరాడాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన వడ్డె ఓబన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జెరిపెటి జైపాల్‌తో కలిసి ముఖ్య అతిథులుగా హాజరై ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. విద్యలేనిదే విజ్ఞానం లేదు, నైతికత లేదు, అభివృద్ధి లేదు, సంపద లేదు… అందుకే బహుజనులందరూ బానిసలైండ్రని ఆనాడే మహనీయుడు జ్యోతిరావుఫూలే అన్నారని గుర్తుచేశారు. మహిళలకు చదువు అవసరమా అనుకునే రోజుల్లో.. సావిత్రీబాయి చదువుకొని తోటి మహిళలకు ఆదర్శంగా నిలిచారని తెలిపారు.
చదువుతోనే సమాజంలో బహుజనులు బాగుపడుతారని, ప్రతిఒక్కరికీ విద్య అవసరం అన్నారు. ఎన్నో బస్తీల్లో పిల్లలు చదువుకు దూరమై కూలీలుగా బతుకుతున్నారని, ఆ పరిస్థితి మారాలన్నారు. బహుజనులందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కావాలని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రచించి మనకు ఇచ్చారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. వడ్డెరలు నేటికీ అట్టడుగు స్థాయిలో ఉన్నారని, వారిలోనూ చైతన్యం రావాలన్నారు. వడ్డె ఓబన్న చరిత్రను కనుమరుగు చేశారని, ఆయన చరిత్ర అందరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
తెల్లాపూర్‌లో కొల్లూరి సత్తయ్య, కొల్లూరి భరత్ ఆస్క్ ఎడ్యుకేషన్ సొసైటీని ఏర్పాటు చేసి బహుజనులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం అభినందనీయమని తెలిపారు. ఇక్కడ విగ్రహా లతో పాటు విజ్ఞాన కేంద్రాల ఏర్పాటు కూడా అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ పసునూరి రవీందర్, నాయకులు సోమిరెడ్డి, వడ్డె నర్సింహులు, వడ్డె లింగయ్య, కుమార్ గౌడ్, కొల్లూరి సత్తయ్య, భరత్, లచ్చిరామ్, నాగరాజు, సాగర్, ఉమేశ్, శ్రీకాంత్‌రెడ్డి, జనార్దన్, వడ్డె సత్తిబాబు, వడ్డెర సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.