సిద్దిపేట, ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మల్లన్నసాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి హాజరైన సీఎం కేసీఆర్ పర్యాటకాభివృద్ధి దిశగా కీలక ప్రకటన చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్, ఏడుపాయల వనదుర్గామాత ఆలయం వద్ద అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకావృద్ధ్దికి సంకల్పించారు. దీనికోసం రూ.1500 కోట్లు ప్రకటించారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ వద్ద రూ.100 కోట్లతో అద్భుతమైన ఇరిగేషన్ కాంప్లెక్స్‌కు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. సిద్దిపేట జిల్లా తొగుట మం డలం తుక్కాపూర్ వద్ద మల్లన్నసాగర్ (టన్నెల్లో)పంప్‌హౌస్ వద్ద బుధవారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి పంప్‌హౌస్‌లు ఆన్‌చేశారు. సీఎం వెంట మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, చామకూర మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్, మెదక్ ఎంపీ కొత్త ప్రభా
కర్‌రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు,ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, సతీశ్‌కుమార్, రఘునందన్‌రావు, మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, శేరిసుభాష్‌రెడ్డి, వంటేరి యాదవరెడ్డి, రఘోత్తంరెడ్డి, నీటిపారుదల రంగ నిపుణుడు వి. ప్రకాశ్, జడ్పీ చైర్పర్సన్లు రోజాశర్మ, హేమలతాశేఖర్‌గౌడ్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, టీఏఎంస్ఏడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఈఎన్సీలు మురళీధర్‌రావు, హరిరాం ఉన్నారు. అనంతరం బండ్‌పైకి వెళ్లి డెలివరీ సిస్టర్న్ వద్ద గంగమ్మ తల్లికి సీఎం కేసీఆర్ పూజలు చేసి చీరె సారె సమర్పించారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు, అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… ‘ఇల్లంతకుంటలో అన్నపూర్ణ రిజర్వాయర్ వద్ద బ్రహ్మాండమైన ప్రకృతి సౌందర్యం ఉంది. అక్కడ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కొట్లాడుతున్నాడు. మంత్రి హరీశ్‌రావు ఇప్పటికే రంగనాయక సాగర్ వద్ద టూరిజం అభివృద్ధి కోసం వంద కోట్ల నిధులు తీసుకున్నారన్నారు. ఇవాళ మంజూరు చేసిన నిధులను ఏమేమి పనులు చేపట్టాలో మీరంతా కూర్చొని మాట్లాడి.. ఈ ఐదు ప్రాంతాల్లో అద్భుతమైన టూరిజం ప్యాకేజీని రూపొందించాలన్నారు. హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు సైతం ఇక్కడికి వచ్చి షూటింగ్‌లు చేసేలా తయారు చేయాలన్నారు. వనదుర్గా ప్రాజెక్టు వద్ద 365 రోజులు నీళ్లు ఉంటయి కాబట్టి, ఆ దేవత ఆశీస్సులతో అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఉంది. అదే విధంగా మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ చుట్లూ నీళ్ల మధ్యలో ఐలాండ్లు ఉన్నాయన్నారు.
మల్లన్నసాగర్ వద్ద 7,500 ఎకరాల అటవీ సంపద ఉంది. మంచి ఔషధాల మొక్కలు నాటుతున్నారు. హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉండడంతో పాటు పెద్ద ఎత్తున రీజినల్ రింగ్ రోడ్డు చాలా సమీపంలో వస్తున్నది. కాబట్టి రెండు ఫోర్‌లైన్ రోడ్లు ఈ ప్రాజెక్ట్ వద్దకు వేయాలని ఇరిగేషన్ సెక్రటరీ రజత్‌కుమార్‌ను కోరుతున్నా, మన రాష్ర్టానికి ఆయువుపట్టు లాంటి ప్రాజెక్ట్ కాబట్టి, ఇరిగేషన్లో ప్రపంచానికి ఒక అద్భుతాన్ని చూపించిన రాష్ట్రం మనది. మన ఇంజినీర్లు ఘనత వహించిన ఇంజినీర్లు.. లిఫ్టింగ్ ఏ రివర్ పేరుతో డిస్కవర్ ఛానల్ యావత్ ప్రపంచానికి చెప్పిన ప్రాజెక్ట్ మన కాళేశ్వరం. న్యూయర్క్‌లో టైమ్ స్కేర్‌లో నెలల తరబడి ప్రదర్శించబడ్డ ప్రాజెక్టు మన కాళేశ్వరం ప్రాజెక్ట్. ఒక ఇంజినీరింగ్ మార్వెల్. మ్యాన్‌మేడ్ మార్వెల్ ఇది. కాబట్టి మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ వద్ద రూ.100 కోట్లతో అద్భుతమైన ఇరిగేషన్ కాంప్లెక్స్‌ను వెంటనే ప్రారంభించాలి. రాష్ట్రస్థాయి ఇంజినీరింగ్ శిక్షణకు సంబంధించిన మంచీచెడ్డ అన్ని ఇక్కడే జరిగేలా వెంటనే అనుమతి ఇచ్చి, ఆ పని కూడా ప్రారంభించాలే. మల్లన్నసాగర్ డెస్టినేషన్ మ్యారెజెస్కు కానీ, సినిమా షూటింగ్‌లకు కానీ యావత్ తెలంగాణ నుంచే కాకుండా దేశవ్యాప్తం గా వచ్చే టూరిస్టులకు ఒక అద్భుతమైన ఆకర్షణగా ఉంటు ంది. పక్కనే యాదాద్రి దేవాలయం, పక్కనే కొమురవెల్లి ఆలయం, ఆకుపచ్చని పొలాలతోని అలలారే ప్రాంతం కాబట్టి, ఈ ప్యాకేజీ ద్వారా ఈ ప్రాంత విశిష్టతను కొనియాడే విధంగా చేయాలి.
మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్ అవసరమైతే రెండు మూడు దేశాలు తిరిగి, ఇతర దేశాల్లో చూసి నేర్చుకొని రండి. నాలుగు బంగలాలు కట్టడం కాదు అద్భుతం ఆవిష్కరించాలే. దుబా య్ బుర్జ్ ఖలీఫాను మించినటువంటి అంతర్జాతీయ స్థాయి కలర్ ఫౌంటెన్లు మల్లన్నసాగర్‌కు రావాలే. మనం సింగపూర్‌కు పోవడం కాదు.. సింగపూర్ నుంచే వాటిని సూడడానికి టూరిస్టులు రావాలె. అంత అద్భుతంగా తయారు చేయాలని కోరుతున్న. 500 మీటర్లు లేపి గోదావరినే ఇక్కడి తెచ్చినం. నావంతు పని నేను చేసిన. ఈ చిన్న పని మీరు చేయాలె. మంత్రి హరీశ్‌రావుకు ఉన్న శక్తి, సామర్థ్యానికి, టాలెంట్‌కు ఏడాదిన్నర లోపల పనికావాలే. శ్రీనివాస్‌గౌడ్, హరీశ్‌రావు ఇద్దరూ కలిసి ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ పూర్తి చేసి, మళ్లీ నన్నే పిలిచి కొబ్బరికాయ కొట్టించాలని కోరుతున్న. మల్లన్న స్వామి ఆశీస్సులతో సస్యశ్యామలమైన పంటలు, అద్భుతమైన టూరిజంతో, గొప్ప రైతులుండే ప్రాంతంగా దిగ్విజయంగా నా సిద్దిపేట దేశానికే ఆదర్శంగా.. నా జిల్లా అద్భుతమైన జిల్లా కావాలని మరొక్క సారి మనసారా కోరుకుంటున్న. ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్న ప్రతివ్యక్తి, ప్రతి కార్మికుడు, ప్రతి ఇంజినీర్‌కు హృదయపూర్వకంగా సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పి సీఎం కేసీఆర్ అన్నారు.
‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మంత్రి హరీశ్‌రావు సేవలు అమోఘం. డైనమిక్ లీడర్ మంత్రి హరీశ్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఆ శాఖ మంత్రిగా ఉండి కొంతకాలం పర్యవేక్షించారు. అవినీతి రహితంగా, రెడ్టేపిజం లేకుండా కాళేశ్వరం పనులు చేశాం. మల్లన్నసాగర్ జనహృదయసాగర్.. జన చరిత సాగర్’.. అని సీఎం కేసీఆర్ అన్నారు. ‘సముద్ర మట్టానికి 557 మీటర్ల ఎత్తున నిర్మించిన జలాశయం. 20 లక్షల ఎకరాలను కడుపులో పెట్టుకొని సస్యశ్యామలం చేసే ప్రాజెక్టు. తెలంగాణలోని అతి భారీ ప్రాజెక్టు మల్లన్నసాగర్‌ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. సస్యశ్యామల తెలంగాణ కావాలని కోరుకుని కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాం. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో 14 రాష్ట్రాల నుంచి 58 వేల మంది కార్మికులు పనిచేసే సమయంలో ఓ దుర్మార్గుడు స్టే తెచ్చాడు. ప్రాజెక్టును ఆపేందుకు 600 పైచిలుకు కేసులు వేశారు. కేసులకు భయపడకుండా ఇంజినీర్లు ధర్మం కోసం పనిచేశారు’..అని సీఎం కేసీఆర్ అన్నారు. ‘నా అభ్యర్థన మేరకు రిటైర్డ్ ఇంజినీర్లు మురళీధర్‌రావు, హరిరామ్ కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పర్యవేక్షించారు. వారికి సెల్యూట్ చేస్తున్న.. గోదావరి జలాలను తెచ్చి కొమురవెల్లి మల్లన్న పాదాలను కడుగుతామని చెప్పాను.
దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట ఫిబ్రవరి 23: తెలంగాణ ప్ర ‘జల’ కష్టాలు తీర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథుడిగా మారి ‘గోదారి’ జలాలను మళ్లించారు. నెర్రలు వారిన బీడు భూముల్లో మల్లన్నసాగర్ ద్వారా సాగు నీరందించి సస్యశ్యామలం చేశారు. తెలంగాణ ఏర్పాటుతో మన నీళ్లు ..మన వనరులు కాపాడుకోవచ్చని నాటి తెలంగాణ ఉద్యమంలో చెప్పిన సీఎం కేసీఆర్ మాటలు నేడు నిజమవుతున్నాయి. ఇందుకు మల్లన్నసాగర్ ప్రాజెక్టు ప్రధాన కార ణం. 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్ సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో నిర్మించడంతో జిల్లాలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి నాబిడ్డ. ఏడుపాయల వద్ద అద్భుతమైన జలపాతం ఉంది. మలన్నసాగర్తో సింగూరు ప్రాజెక్టును నింపుతారు కాబట్టి ఏడుపాయల వద్ద టూరి జం ప్యాకేజీ కావాలని ఆమె అడుగుతున్నా రు’..అని సీఎం కేసీఆర్ అన్నారు.
సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 23 : సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన విజయవంతమైందని, సహకరించిన ప్రతి ఒక్కరికీ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. కలెక్టర్ హనుమంతరావు, సీపీ శ్వేత, అడిషనల్ కలెక్టర్లు ముజామ్మిల్‌ఖాన్, శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధికార యంత్రాంగం, పాత్రికేయులు సీఎం పర్యటన ఖరారైనప్పటి నుంచి విజయవంతం చేసేందుకు శ్రమించారన్నారు
‘ప్రాజెక్టులు భూమ్మీదనే కట్టాలి. ఇందులో భాగంగా కొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఆ గ్రామాలు నాకు ప్రాణప్రదమైన గ్రామాలు.. లక్ష కోట్లతో ప్రాజెక్టులు కట్టిన ఇంజినీర్లు నిర్వాసితులకు కడుపునిండా పరిహారం ఇచ్చి న్యాయం చేయాలని అధికారులకు చెప్పాను’..అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇంకెవరికైనా పరిహారం రాకుంటే వారికి పరిహారం ఇస్తామన్నారు. ప్రాజెక్టు పూర్తి కాకూడదని కొందరు కుట్రలు చేశారని, నిర్వాసిత గ్రామాలకు పూర్తి న్యాయం చేస్తామన్నారు. ఆసియా ఖండంలోనే ఎక్కడా లేని విధంగా గజ్వేల్, ఇతర చోట్ల నిర్వాసిత కాలనీలు కట్టామని సీఎం కేసీఆర్ తెలిపారు. నిర్వాసిత కుటుంబాలకు ఉపాధి దొరికేలా డెయిరీ, ఇతర స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేయాలన్నారు. 10.64 టీఎంసీల నీరు మల్లన్నసాగర్లో ప్రస్తుతం ఉందని, 3 సంవత్సరాల్లో పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నింపుతామన్నారు. కొండపోచమ్మసాగర్‌లో చిన్నచిన్న లోపాలను ఇంజినీర్లు సవరించాలని సీఎం సూచించారు. సిద్దిపేట జిల్లా దేశానికి ఆదర్శంగా నిలువాలన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన వారందరికీ సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.