స్వరాష్ట్రంలో జనగామ నియోజకవర్గం ప్రగతి పథంలో పయనిస్తున్నది. అభివృద్ధిలో దూసుకుపోతున్నది. విద్య,వైద్య రంగాల్లో ప్రత్యేక స్థానాన్ని పొందింది. సీఎం కేసీఆర్ కృషితో జనగామ కొత్త జిల్లాగా ఏర్పడింది. పలు కొత్త మండలాలు, గ్రామాలు ఏర్పాటుతో ప్రజలకు పాలన చేరువైంది. చేర్యాల,కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలు సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నాయి. అన్ని గ్రామాలకు బీటీ రోడ్డు, గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం జరిగింది. గోదావరి జలాలు రావడంతో కరువు నేల పచ్చగా మారింది. బంగారు పంటలు పండుతున్నాయి. వలసలు దూరమయ్యాయి. పల్లెలు, పట్టణాలు కొత్తరూపును సంతరించుకున్నాయి.
చేర్యాల/మద్దూరు/ ధూళిమిట్ట/ కొమురవెల్లి, నవంబర్ 17: స్వరాష్ట్రంలో జనగామ నియోజకవర్గం ప్రగతి పథంలో పయనిస్తున్నది. సిద్దిపేట, జనగామ జిల్లాల్లో 8 మండలాలతో ఈ నియోజకవర్గం విస్తరించి ఉంది. సిద్దిపేట జిల్లాలో చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలు ఉన్నాయి. మిగతా నాలుగు మండలాలు జనగామ జిల్లాకిందికి వస్తాయి. పరిపాలనా సౌలభ్యం కోసం ఈ నియోజవవర్గంలో కొమురవెల్లి, ధూళిమిట్ట మండలాలు, చేర్యాలలో 3, కొమురవెల్లిలో 2, మద్దూరు ఉమ్మడి మండలంలో 3 కొత్త గ్రామ పంచాయతీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొమురవెల్లి మండలంలోని తపాస్‌పల్లి, మద్దూరు మండలంలోని లద్నూర్ రిజర్వాయర్లలోకి గోదావరి జలాలు వదిలి అక్కడి నుంచి చెరువుల్లో నీటిని పంపింగ్ చేయడంతో రికార్డు స్ధాయిలో పంటలు పండుతున్నాయి. నియోజకవర్గంలో 39,893 మందికి ఆసరా పింఛన్ల కింద ప్రతినెలా రూ.12.50 కోట్లు ఖర్చుచేస్తుండగా, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్లకు కనీస అర్హతను 65 ఏండ్ల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించడంతో జిల్లాలో అదనంగా 5,974 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరింది. జనగామలో రూ.199 కోట్లతో మెడికల్ కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జనగామ జిల్లా జనరల్ దవాఖానను అప్‌గ్రేడ్ చేసి వైద్యసేవలను మరింత విస్తృతం చేసింది.
మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న చేర్యాలను బీఆర్ఎస్ సర్కారు మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన మూడేండ్లలోనే రూ.20 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు చేపట్టింది. వార్డుల వారీగా అభివృద్ధి పనులు చేపట్టారు. పట్టణ ప్రకృతి వనం, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. చేర్యాల పెద్ద చెరువు కట్టను విస్తరించి కట్టపై మొక్కల పెంచారు. చెరువు కట్ట ప్రజలకు వాకింగ్, జాగింగ్‌కు అనుకూలంగా మారింది. చేర్యాలలో వార సంతతో పాటు రోజువారీగా కొనసాగే మార్కెట్‌కు పక్కా భవనం నిర్మించేందుకు రూ.3కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. మున్సిపాలిటీ కార్యాలయ భవనం తొలిగించి అదే ప్రదేశంలో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం పురోగతిలో ఉంది. చేర్యాల ఆర్టీసీ బస్ స్టేషన్లో కోటి రూపాయలతో ఆధునీకరించి వసతులు కల్పించింది. చేర్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల కోసం వివిధ సదుపాయాలను సర్కారు కల్పించింది. రైతులు తెచ్చిన పంట ఉత్పత్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు షెడ్స్‌తో పాటు వాటి పై డోమ్స్ ఏర్పాటు చేసింది. రైతులకు తాగునీటి వసతితో పాటు ప్యాడీక్లీనర్లు, రైతు విశ్రాంతి భవనం ఏర్పాటు చేశారు.కొత్తగా రూ. కోటి వ్యయంతో మార్కెట్‌యార్డు ముందు ప్రధాన రహదారి పక్కనే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభించారు. చేర్యాలలో వైద్య విధాన పరిషత్ నిధులు రూ.11 కోట్లతో సామాజిక వైద్యశాల నిర్మిస్తున్నారు. 30 పడకలతో అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చనున్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డు వెనుక భాగంలో గల రెండున్నర ఎకరాల స్థలంలో దీనిని నిర్మిస్తున్నారు.
చేర్యాల నుంచి ఆకునూరు మీదుగా ధూళిమిట్ట, నంగునూరు మండలాలకు ప్రయాణించాలంటే ఒకప్పుడు గుంతలమైన రోడ్డుతో ప్రయాణికులు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. రూ.3.30 కోట్లతో చేర్యాల నుంచి ఆకునూరు మీదుగా ధూళిమిట్ట మండల కేంద్రానికి రోడ్డు విస్తరణ జరగడంతో ప్రయాణం సాఫీగా సాగుతున్నది. రోడ్డు విస్తరణ పూర్తవడంతో చేర్యాల, కొత్త దొమ్మాట, ఆకునూరు, లింగాపూర్, ధూళిమిట్ట, తోర్నాల, జాలపల్లి, నంగునూరు మండల ప్రజలతో పాటు హుస్నాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వారికి ఎంతో సౌకర్యంగా మారింది. చేర్యాల నుంచి చుంచనకోట మీదుగా యాదాద్రి వెళ్లేందుకు రూ.11కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు.
రెండు మండలాలలోని 21 గ్రామ పంచాయతీల్లో కోట్లాది రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణాలు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు పూర్తయ్యాయి. దీంతో గ్రామాలన్నీ ప్రస్తుతం అద్దంలా తయారయ్యాయి. మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లోని అన్ని గ్రామాల్లో రూ. 6కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. రూ.50లక్షలతో 4వేల మీటర్ల మేర అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి చేశారు.
మర్మాముల, ధర్మారం, లింగాపూర్ గ్రామాల్లో రూ. 13లక్షల చొప్పున నిధులతో గ్రామ పంచాయతీ భవనాలను నిర్మించింది. గాగిళ్లాపూర్, బైరాన్‌పల్లి, లద్నూర్, వంగపల్లి, హనుమతండా, దుబ్బతండా, రెడ్యానాయక్‌తండా గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం పక్కా భవనాల కోసం నిధులు మంజూరు చేసింది. బైరాన్‌పల్లిలో రెండు అంగన్వాడీ కేంద్రాల భవనాలను ప్రభుత్వం నిర్మించింది.ధూళిమిట్టలో హెల్త్ సబ్‌సెంటర్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. మద్దూరు, అర్జున్‌పట్ల గ్రామాల్లో రూ.20 లక్షల చొప్పున నిధులుతో నిర్మిస్తున్న సబ్‌సెంటర్ భవనాల పనులు, మద్దూరులో రూ. 20లక్షలతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి.
చేర్యాల పట్టణంలో రూ.1.20 కోట్లతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడంతో మూడు కిలోమీటర్ల మేర విద్యుత్ దీపాలతో పట్టణం జిగేల్ మంటున్నది. అలాగే పట్టణంలో రూ.2.50 కోట్లతో రోడ్డు విస్తరణ చేపట్టి డివైడర్ ఏర్పాటు చేశారు. డివైడర్‌లో మొక్కలు నాటడంతో ఓవైపు పచ్చని చెట్లు, మరోవైపు సెంట్రల్ లైటింగ్‌తో ఏర్పాటుతో పట్టణం జిగేలుమంటున్నది. రూ.కోటితో పట్టణంలో సబ్‌స్టేషన్ నిర్మించారు.
మద్దూరు, ధూళిమిట్ట మండలాల పరిధిలో తొలి విడతలో నర్సాయపల్లి, బైరాన్‌పల్లి, కొండాపూర్, జాలపల్లి గ్రామాల్లో ప్రభుత్వం 100కు పైగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించింది. వీటిని పేదలకు కేటాయించింది. కొనసాగుతున్న సమీకృత భవన నిర్మాణ పనులు చేర్యాల పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట నిర్మించేందుకు రూ.17 కోట్లతో సమీకృత భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇందులోనే పురపాలక సంఘం కార్యాలయం నిర్మిస్తున్నారు.
స్వరాష్ట్రంలో మద్దూరు, ధూళిమిట్ట మండలాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. మారుమూల మండలాలైన మద్దూరు, ధూళిమిట్ట మండలాల అభివృద్ధికి ప్రభు త్వం కోట్లు ఖర్చు చేస్తున్నది. మద్దూరు మండల కేంద్రంతో పాటు అర్జున్‌పట్ల, బైరాన్‌పల్లి గ్రామాల్లో రూ. 5కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేసింది. నూతనంగా ఏర్పడిన ధూళిమిట్ట మండల కేంద్రంలో విద్యుత్ సెక్షన్ ఆఫీసును ప్రభుత్వం మంజూరు చేసింది.
మద్దూరు, అర్జున్‌పట్ల, బైరాన్‌పల్లి, మర్మాముల తదితర గ్రామాల్లో విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణాలతో విద్యుత్ సరఫరా మెరుగుపడింది. ధూళిమిట్ట మండల కేంద్రంలో సెక్షన్ కార్యాలయ భవన నిర్మాణ పురోగతిలో ఉన్నాయి.
తీవ్ర కరువు పరిస్థితులతో కొట్టుమిట్టాడే మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లోని సుమారు 10 పెద్ద చెరువులు, 30 చెరువు, కుంటలను ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించింది. దీంతో భూగర్భ జలాలు పెరిగి బోరుబావులల నిండా నీరు ఉండడంతో సాగు విస్తీర్ణం రెండింతలు పెరిగింది. లద్నూర్ రిజర్వాయర్‌లోకి దేవాదుల ద్వారా గోదావరి జలాలను విడుదల చేసి రిజర్వాయర్ ద్వారా చెరువు, కుంటలను ఈ ప్రభుత్వం నింపింది. రంగనాయకసాగర్ నుంచి కమలాయపల్లి, అర్జున్‌పట్ల, ధూళిమిట్ట, లింగాపూర్ గ్రామాలకు కాలువల ద్వారా ప్రభుత్వం గోదావరి జలాలను విడుదల చేసింది.
ధూళిమిట్ట ప్రజల ఆకాంక్షను గుర్తించి రెండేండ్ల క్రితం ధూళిమిట్టను మండలంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ధూళిమిట్ట మండల కేంద్రంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ధూళిమిట్ట మండల కేంద్రంలో రూ. 15లక్షలతో కరెంట్ సెక్షన్ ఆఫీస్, రూ. 25లక్షలతో ఆరోగ్య ఉపకేంద్రం, రూ.20లక్షలతో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్, రూ. 40లక్షలతో సీసీ రోడ్ల నిర్మా ణం, రూ. 15లక్షలతో గ్రామీణ సంత, మనఊరు-మనబడి కార్యక్రమం కింద ప్రాథమిక పాఠశాలకు రూ. 28లక్షలు, ఉన్నత పాఠశాలకు రూ. 57లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. గ్రామంలో రూ.4కోట్లతో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటుకు నిధులు మంజూరయ్యాయి. గ్రామంలో డీఎంఎఫ్ నిధులు రూ. 10లక్షలతో అంగన్వాడీ కేంద్రం భవనం, ఈజీఎస్ నిధులు రూ. 50లక్షలతో చేపట్టే సీసీ రోడ్ల నిర్మాణ పనులు, డీఎంఎఫ్ నిధులు రూ. 20లక్షలతో చేపట్టే విలేజ్ కమ్యూనిటీ హాల్, రూ. 10లక్షలతో రెడ్డి కమ్యూనిటీ హాల్, రూ. 10లక్షలతో గ్రామంలోని నాలా పూడ్చివేత పను లు, రూ. 10లక్షలతో పద్మశాలి కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. కొద్దిరోజుల క్రితం రాష్ట్ర వైద్యారోగ్య శాఖమంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు.
మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో వివిధ గ్రామాలను కలిపే మట్టిరోడ్లన్నీ బీటీగా మారాయి. తోర్నాల నుంచి బెక్కల్ గ్రామాల మధ్య రూ.1.80 కోట్లతో 3కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణం, మద్దూరు-సలాఖపూర్ గ్రామాల మధ్య రూ. 2.40 కోట్లతో బీటీ రోడ్డు, మర్మాముల-మద్దూరు వయా ధర్మారం గ్రామాల మధ్య రూ.2.42 కోట్లతో 4.72కిలోమీటర్ల బీటీ రోడ్డు, బెక్కల్(చర్చితండా) నుంచి వయా అంక్షాపూర్ మహారాజ్తండా వరకు రూ.80లక్షలతో 1.96కిలోమీటర్ల బీటీ రోడ్డు, మద్దూరు నుంచి నర్సాయపల్లి వయా పిట్టలగూడెం రూ.2.25 కోట్లతో 3.72కిలోమీటర్ల బీటీ రోడ్డు, తోర్నాల-ధూళిమిట్ట గ్రామాల మధ్య రూ.1.10 కోట్లతో 2.17 కిలోమీటర్ల బీటీ రోడ్డు, రేబర్తి-లింగాపూర్ వయా జెల్లగూడెం రూ.1.50 కోట్లతో 4.23కిలోమీటర్ల బీటీ రోడ్డు, లద్నూర్-మర్మాముల రూ.2కోట్లతో 3.33కిలోమీటర్ల బీటీ రోడ్డు, రేబర్తి-అమ్మాపూర్ వయా వంగపల్లి రూ.2.49 కోట్లతో 4.19 కిలోమీటర్ల బీటీ రోడ్డు, చెలిమెతండా చౌరస్తా నుంచి అంక్షాపూర్ వరకు రూ. కోటితో 1.49 బీటీ రోడ్డు, చెలిమెతండా నుంచి మహారాజ్ తండా వయా హనుమతండా వరకు రూ.కోటితో 1.11 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు, చెలిమెతండా అంక్షాపూర్ ఎక్స్‌రోడ్డు నుంచి రెడ్యానాయక్‌తండా వయా పంతులు తండా వరకు రూ.కోటితో 2.06 కిలోమీటర్ల బీటీ రోడ్లను ప్రభుత్వం నిర్మించింది. ప్రధానంగా గ్రామాలను కలిపే లింక్‌రోడ్లు బీటీరోడ్లుగా మారిపోయాయి. ఆకునూరు-ధూళిమిట్ట గ్రామాల మధ్య డబుల్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. మారుమూల గిరిజన తండాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయి.
పరిపాలనా సౌలభ్యం కోసం 2016 ఏర్పడిన కొమురవెల్లి ప్రగతిపథంలో దూసుకెళ్తున్నది. మండల కేంద్రంలో రూ.20.90 కోట్లతో 38 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి లబ్ధ్దిదారులకు అందజేశారు. కొమురవెల్లి మల్లన్న చెరువును మిషన్ కాకతీయ మూడో విడతలో రూ.2,91,7500 నిధులతో మినీట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేసి మల్లన్న క్షేత్రానికి వచ్చే భక్తులకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దారు.కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న భక్తులు అక్కడి నుంచి జగదేవ్‌పూర్ మండలంలోని తీగుల్నర్సాపూర్లోని కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు. కొమురవెల్లి నుంచి కొండపోచమ్మకు వెళ్లేదారి గతంలో సింగిల్ రోడ్డు గుంతలమయంగా ఉండేది. కొమురవెల్లి మండల ఏర్పాటు తర్వాత ఐనాపూర్ ఎల్లమ్మ ఆలయం వద్ద నుంచి కొండపోచమ్మ ఆలయం వరకు రూ.38 కోట్లతో సింగిల్‌రోడ్డును 7 కిలోమీటర్ల మేర డబుల్‌గా మార్చారు. కొమురవెల్లిలో రూ.కోటితో పోలీస్‌స్టేషన్ నిర్మించారు. కొమురవెల్లి మండలంలో కొమురవెల్లి, పోసాన్పల్లి, కిష్టంపేట, గురువన్నపేట గ్రామాల్లో గ్రామపంచాయతీ భవనాలు పూర్తి కాగా, తపాస్‌పల్లి, గౌరాయపల్లి గ్రామాల్లో పురోగతిలో ఉన్నాయి.