జహీరాబాద్, జూన్ 10 : హైదరాబాద్-ముంబయి బుల్లెట్ ట్రైన్ సాధన కోసం సంగారెడ్డి జిల్లాలో ప్రజలు పోరుబాటకు సిద్ధమయ్యారు. హైదరాబాద్-ముంబయి మధ్య 900 కిలో మీటర్ల దూరాన్ని కేవలం 3 గంటల్లోనే చేరుకునేలా మొదటి విడత డీఆర్‌పీలో కేంద్రం బుల్లెట్ ట్రైన్‌ను ప్రతిపాదించింది. దీని కోసం సంబంధిత రైల్వే అధికారులు సర్వేలు, భూ పరీక్షలు నిర్వహించారు. ఈ బుల్లెట్ ట్రైన్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో నిలిపేందుకు స్టేషన్ ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే రెండో డీఆర్‌పీలో జహీరాబాద్‌కు బదులుగా కోకాపేట్, వికారాబాద్ మీదుగా బుల్లెట్ ట్రైన్‌ను మళ్లించడంతో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీని కోసం వివిధ రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మేధావులు, వర్తక వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సభ్యులు ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
వికారాబాద్ మీదుగా దారిమళ్లిన బుల్లెట్ ట్రైన్ జహీరాబాద్ మీదుగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయా రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సంగారెడ్డి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలకు వినతి పత్రాలు అందజేశారు. సంబంధిత రైల్వే మంత్రిత్వ శాఖ, సంబంధిత రైల్వే అధికారులకు సైతం వినతి పత్రాలు అందజేశారు. బుల్లెట్ ట్రైన్ సాధనలో భాగంగా బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆతిథి హోటల్లో రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉద్యోగ, వ్యాపార, వర్తక సంఘాలు, స్వచ్ఛంధ సంస్థలు, విద్యార్థి సంఘాల నాయకులు రౌండ్ టెబుల్ సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు.
జహీరాబాద్ ప్రాంతం వ్యాపార, వాణిజ్య రంగాల్లోనే కాకుండా పారిశ్రామికంగా అభివృద్ధి బాటలో దూసుకెళ్తున్న క్రమంలో బుల్లెట్ ట్రైన్ కీలకంగా మారనుంది. ఇప్పటికే జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించబడిన దేశ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పరిశ్రమలు నెలకొల్పుతున్నారు. హైదరాబాద్-నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధిలో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్, ఝరాసంగం మండల పరిధిలోని నిమ్జ్ ప్రాజెక్టులో ప్రపంచ స్థాయి ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంది.
గత నెల 10న ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిమ్జ్ ప్రాజెక్టులో 3,200 ఎకరాల విస్తీర్ణంలో స్మార్‌సిటీ ఏర్పాటు చేసేందుకు వర్చునల్గా ప్రారంభించిన విషయం తెలిసిందే. రూ. 2.300 కోట్లతో లేవుట్ అభివృద్ధి, రహదారులు, విద్యుత్, డ్రైనేజీ, తాగునీటి సదుపాయం, పార్కులు, ఇంటర్నేట్ తదితర మౌలిక వసతులు కల్పించేందుకు వేగంగా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఆయా మండలాల పరిధిలోని నిమ్జ్ ప్రాజెక్టులో ప్రైవేట్ రక్షణ రంగ సంస్థ వెమ్ టెక్నాలజీ, కార్ల తయారీ పేరుగాంచిన హ్యుందాయ్ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు 1,200 ఎకరాల భూములు కేటాయించారు.
ప్రస్తుతం ఆయా పరిశ్రమల ఏర్పాటు పనులు ముమ్మరంగా కొనసాగుతున్న క్రమంలో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందిన కీలక నేతలు, ప్రజాప్రతినిధులు కేంద్రంలో చక్రం తిప్పడం మూలంగా కోకాపేట్-వికారాబాద్, కల్బుర్గి మీదుగా బుల్లెట్ ట్రైన్ వెళ్లేందుకు మార్గాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఫలితంగా నిమ్జ్ ప్రాజెక్డు, స్మార్ట్‌సిటీలతో పాటు జహీరాబాద్ ప్రాంత అభివృద్ధికి తీరని అన్యాయం జరుగుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్ ప్రాంతంలోని నిమ్జ్, స్మార్ట్‌సిటీలో పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్న క్రమంలోనే రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందిన రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, కీలక నేతలు కేంద్రం పెద్దలతో తమ ప్రయత్నాలు చేసి రెండో విడత డీపీఆర్‌లోని అలైన్మెంట్లో బుల్లెట్ ట్రైన్ రూట్‌ను మార్చివేశారు.
కోకాపేట్, వికారాబాద్, కల్బుర్గి మీదుగా ముంబయికి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొనడంతో జిల్లా వ్యాప్తంగా బుల్లెట్ ట్రైన్ సాధన కోసం కదనరంగంలోకి దిగారు.బుల్లెట్ ట్రైన్ సాధన కోసం కార్యాచరణ రూపొందించి జిల్లాలోని ఆయా ప్రాంతాలతో పాటు కర్ణాటక ప్రాంతాల రాజకీయ పార్టీలు, నాయకులు తదితరు సహకారం తీసుకుని కలిసిగట్టుగా పోరాటం చేయాల్సి అవసరం ఎంతైనా ఉందన్నారు. బుల్లెట్ ట్రైన్ కోసం అఖిలపక్ష ప్రజాప్రతినిధులు, నాయకులు ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలతో పాటు సంబంధిత రైల్వేమంత్రిత్వశాఖ అధికారులను కలిసి జహీరాబాద్ మీదుగా బుల్లెట్ రైలు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరుదామన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీపాటిల్, జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సామాజిక కార్యకర్త నెమలిగోండ వేణుమాధవ్ పాల్గొన్నారు.