వెల్దుర్తి, జూన్ 30: వెల్దుర్తి పట్టణంలోని (Yeldurthy) సెంట్రల్ బ్యాంకులో చోరీకి విఫలయత్నం జరిగింది. ఆదివారం రాత్రి సుమారు 1.30 గంటల సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బ్యాంకు భవనం వెనుక వైపు నుంచి రంద్రం చేసి స్టోర్ రూమ్‌లోకి ప్రవేశించారు. అనంతరం గది తలుపును పగలగొట్టి బ్యాంకు ప్రధాన భవనంలోకి వెళ్లారు. స్ట్రాంగ్ రూమ్‌లోని లాకర్‌ను తెరిచేందుకు యత్నించగా సేఫ్టీ అలారం మోగడంతో దొంగలు వచ్చిన దారిలోనే బయటకు పరుగులు తీశారు. సేఫ్టీ అలారంతో అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ రంగా కృష్ణ, వెల్దుర్తి ఎస్ఐ రాజుపాటు అధికారులు బ్యాంకు వద్దకు చేరుకొని దొంగలు చోరీకి యత్నించిన తీరును పరిశీలించారు. మెదక్ నుంచి వచ్చిన క్లూస్ టీమ్ బ్యాంకులో ఆధారాలను సేకరించారు. ఇదిలా ఉండగా గతంలో సైతం ఇదే తరహాలో బ్యాంకు వెనకవైపు నుంచి కన్నం వేసిన దొంగలు చోరీకి యత్నించడం గమనార్హం.