రాయపోల్, నవంబర్ 17: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రామారం నుంచి వయా సయ్యద్‌నగర్ మీదుగా గుర్రాలసోఫ వరకు రోడ్డు మరమ్మతు పనులు జరగడం లేదు. దీంతో ప్రయాణికులతోపాటు వాహనదారులు ఇబ్బందులు పడతున్నారు. అర్అండ్బీ అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం ఫలితంగా ఆ రోడ్డుపై వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. రోడ్డు మరమ్మతు కోసం నిధులు మంజూరు చేసినా పనులు ఎందుకు జరగడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
గతంలో ఈ రోడ్డుగుంతలమయంగా మారడంతో మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూ రు చేయగా రోడ్డును తవ్వి కంకర వేసినా పనులు మాత్రం జరగడం లేదు. కంకర వేసిన రోడ్డుపై రోజూ ప్రయాణికులు, వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. పనులు త్వరగా పూర్తిచేయాల్సిన అధికారులు, కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడంతోనే ఈ దుస్థితి వచ్చిందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.
కంకర వేశారు… బీటీ రోడ్డు వేయడం లేదని ప్రజలు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. నిత్యం వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం గజ్వేల్‌కు వెళ్తారు. అయితే వీరికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు. కంకర వేసిన రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేయాలని ఆయా గ్రామాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. తొగుట సీఐ లతీఫ్, ఎస్సై రఘుపతి ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడి బస్సును పునరుద్ధరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అసంపూర్తిగా కంకర వేసి ఉన్న రోడ్డుకు మరమ్మతులు చేయాలని ప్రయాణికులు, విద్యార్థులు కోరుతున్నారు.