మెదక్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): అన్ని ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం ఉంటేనే అభివృద్ధితో పాటు ప్రజలు సుఖమయ ప్రయాణం చేస్తారనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రహదారులు నిర్మాణం, పునరుద్ధరణ పనులకు నిధులు కేటాయించిందని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఇందుకు ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని పనులు ప్రారంభించాలని ఆయన సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు చంద్రాగౌడ్, అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్‌తో కలిసి నర్సాపూర్ నియోజకవర్గంలో చేపట్టిన రహదారుల నిర్మాణం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇంటిగ్రేటెడ్ మారెట్ యార్డ్, మురుగు కాలువలు, డంపింగ్ యార్డ్, వైకుంఠ ధామం, పార్, గ్రంధాలయం, కమ్యూనిటీ భవనాలు, స్టేడియం, తదితర నిర్మాణాల ప్రగతి పై అంశాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ రాజ్ శాఖ ద్వారా గ్రామీణ రహదారుల నిర్వహణ, వరద నష్ట ఉపశమనం, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, 15వ ఆర్ధిక కమిషన్, సీఎస్ఆర్ నిధులు వంటి పథకాల కింద నియాజక వర్గంలో సుమారు రూ.83 కోట్లతో 71 రహదారుల నిర్మాణం పనులు చేపట్టేందుకు అనుమతులు రాగా, కొన్ని పనులు మాత్రమే పూర్తయ్యాయన్నారు. ఇంతవరకు టెండరు రాని వాటికి మరోమారు టెండర్లు ఆహ్వానించి, కాంట్రాక్టర్లను ప్రోత్సహిస్తూ పనులు చేపట్టేలా ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు.
రోడ్లు, భవనాల శాఖ ద్వారా రూ.19 కోట్ల 75 లక్షల వ్యయంతో 39.50 కిలో మీటర్ల మేర చేపట్టే బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులకు త్వరగా టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చూడాలని సూచించారు. రహదారుల నిర్మాణాలు పూర్తయితే ప్రతి అగ్రికల్చర్ ల్యాండ్ వరకు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం కల్గుతుందన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రగతిని సమీక్షిస్తూ నర్సాపూర్, ఉప్పులింగాపూర్‌లో ముగింపు దశలో ఉన్న ఇండ్లను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసి, ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు. వెల్దుర్తి, రంగంపేట లో నిర్మిస్తున్న ఆరోగ్య ఉప కేంద్రాలను మే 15 నాటికి పూర్తి చేయాలన్నారు. బిల్లులు చెల్లిస్తామని, త్వరగా గ్రంథాలయ భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టరును పురమాయించాలన్నారు. ఆర్టీసీ బస్టాండులో ఉద్యాన ఏర్పాటు, డంప్ యార్డ్ సమీపంలో పశువధ శాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు. స్టేడియం నిర్మాణానికి స్థల పరిశీలన చేసి, పనులు ప్రారంభించాలన్నారు. సమావేశంలో పంచాయతీ రాజ్ ఈఈ సత్యనారాయణరెడ్డి, ఆర్అండ్బీ డిప్యూటీ ఈఈ శ్రీనివాస్, డిప్యూటీ ఈఈలు, ఏఈ లు, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, జడ్పీ కోఅప్షన్ సభ్యులు మన్సూర్, కాంట్రాక్టర్లు, నర్సాపూర్, కౌడిపల్లి తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.