గజ్వేల్, నవంబర్ 8: సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చుట్టూ చేపట్టిన రింగ్‌రోడ్డు పనులు ధర్మారెడ్డిపల్లి సమీపంలో శరవేగంగా కొనసాగుతున్నాయి. ధర్మారెడ్డిపల్లి-జాలిగామ గ్రామాల సమీపంలో రైల్వే బ్రిడ్జి నిర్మాణం జరగడంతో అక్కడ పనులు కొద్ది రోజుల పాటు పెండింగ్‌లో ఉండగా గతేడాది నుంచి వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఒకవైపు పనులు పూర్తికాగా మరో వైపు పనులు చేపడుతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో…
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చుట్టూ 23కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కోసం రూ.230కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ రోడ్డు నిర్మాణం నాలుగు వరుసలుగా చేపట్టారు. అయితే పాతూర్ రాజీవ్ రహదారి నుంచి రిమ్మనగూడ గ్రామ సమీపంలోని రింగ్‌రోడ్డు వరకు భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఆరు వరుసలుగా రోడ్డు నిర్మాణం చేపట్టి బటర్‌ఫ్లై లైట్లు ఏర్పాటు చేశారు. ప్రధాన వాహనాలు, కంటైనర్లు, ఇతర రాష్ర్టాలకు వెళ్లేవన్నీ రింగ్‌రోడ్డు మీదుగా తూప్రాన్, సంగారెడ్డి, నిజామబాద్, జగదేవ్‌పూర్, భువనగిరి, చిట్యాల, నార్కట్‌పల్లి మీదుగా హైవేకు చేరుకునేలా మున్సిపల్ సమీపంలోని గ్రామాల మీదుగా రింగ్‌రోడ్డును కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ధర్మారెడ్డిపల్లి-జాలిగామ గ్రామాల సమీపంలో రైల్వే బ్రిడ్జి 1.6కిలోమీటర్ల రోడ్డు పనులు సాగుతున్నాయి. మరి కొద్ది రోజుల్లోనే ఇక్కడ పనులు పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

తీరనున్న ట్రాఫిక్ సమస్య
ధర్మారెడ్డిపల్లి-జాలిగామ గ్రామాల సమీపంలో రైల్వే బ్రిడ్జి వద్ద పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్య తీరనుంది. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని చేపట్టిన రింగ్‌రోడ్డు మీదుగా ఇతర రాష్ర్టాలకు భారీ కంటైనర్లు, ఇతర వాహనాలు వెళ్లనున్నాయి. రింగ్‌రోడ్డు పూర్తి కాగానే పట్టణంలోకి భారీ వాహనాలు రాకుండా ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పిస్తే పట్టణవాసులకు ట్రాఫిక్ సమస్య తీరుతుంది. భారీ వాహనాలు పట్టణం మీదు గా వెళ్లనుండడంతో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
గజ్వేల్ నుంచి సంగాపూర్ వెళ్లే మార్గంలో..
గజ్వేల్ నుంచి సంగాపూర్ వెళ్లే మార్గంలో పాత ఆర్డీవో కార్యాలయం సమీపంలో రింగ్‌రోడ్డు సర్కిల్ వద్ద పెండింగ్‌లో ఉన్న 60మీటర్ల రోడ్డు నిర్మాణం పూర్తి చేసి పట్టణవాసులకు అందుబాటులోకి తీసుకరావాలని పట్టణవాసులు, వాహనదారులు, ఆర్అండ్ఆర్ కాలనీ వాసులు కోరుతున్నారు. అక్కడ ఒక వైపు నుంచి వాహనాలు వెళ్తుండటంతో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో రాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అదే విధంగా సమీపంలోనే విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. వీటన్నింటి దృష్టిలో ఉంచుకొని అధికారులు త్వరగా అక్కడ పనులు పూర్తి చేసేలా చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు.