పటాన్చెరు, జనవరి 4: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలోని సర్వేనెంబర్ 329 ఖాళీ జాగాల కబ్జాపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వారం రోజులుగా వచ్చిన వరుస కథనాలు అక్షర సత్యాలుగా అధికారులు గుర్తించారు. నమస్తే తెలంగాణ కథనాలపై విచారణ చేసిన అధికారులకు అక్కడ దాదాపు 75 ప్లాట్లలో నిర్మాణాలు జరుగుతున్నాయని గుర్తించారు. వాటిలో కేవలం 19మందికి మాత్రమే 2008 నాటి పట్టాలు ఉన్నాయని గుర్తించారు. నాయకులు, వారి అనుచరులు 56 ప్లాట్లు కబ్జా చేసి ఇండ్ల నిర్మాణం చేస్తున్నారని గుర్తించారు. విచారణ నివేదికను కలెక్టర్‌కు సమర్పించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
వరుస సెలవులను అనువుగా మార్చుకుని చిట్కుల్లో లబ్ధ్దిదారులం అంటూ 2008 నాటి పట్టాలతో భారీ సంఖ్యలో సర్వేనంబర్ 329లో కబ్జాలకు దిగి ఇండ్లు నిర్మాణ పనులు ప్రారంభించారు. వందలాది మంది ప్లాట్లకు పహారా ఉంటూ నాయకుల డైరెక్షన్లో కబ్జా పర్వం ప్రారంభించారు. ఆకస్మికంగా పెద్ద ఎత్తున్న నిర్మాణాలు జరుగుతుండటంతో ‘నమస్తే తెలంగాణ’ డిసెంబర్ 29న ‘ప్రభుత్వ భూమికి ఎసరు’ అనే కథనం, డిసెంబర్ 30న ‘ఇప్పటికైతే అర్థాంగీకారం…రేపు ప్రశ్నార్ధకం?’..అనే మరో కథనం, డిసెంబర్ 31న ‘వామ్మో.. సర్వే నెంబర్ 329’ అనే వరుస కథనాలు ప్రచురించింది.
ఈ కథనాలతో పటాన్చెరు తహసీల్దార్ రంగారావు, ఎంపీవో హరిశంకర్‌గౌడ్ ఆధ్వర్యంలో వచ్చిన అధికార బృందం అక్రమ నిర్మాణాలను నిలిపివేశారు. కబ్జాదారులు అధికారులను గెర్హావ్ చేసి పాత పట్టాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీకి చెందిన నాయకుల ప్రోద్బలంతో వారి అనుచరులు అధికారులపై చెలరేగిపోయారు. తహసీల్దార్ పనులు నిలిపివేయాలని చెబుతూ యాక్షన్‌కు దిగారు. కలెక్టర్‌కు విచారణ చేసి రిపోర్టు ఇస్తామని, పై అధికారుల ఆదేశాలు వచ్చేవరకు నిర్మాణాలు పూర్తిగా నిలిపివేస్తున్నామని గట్టిగా హెచ్చరిస్తూ సిబ్బందిని నిఘాకు నియమించారు. అయినా కొందరు కబ్జాదారులు పనులు చేస్తుండడంతో, ఆ పనులు చేస్తున్న ఆరుగురు మేస్త్రీలను తహసీల్దార్ ఎదుట రెవెన్యూ సిబ్బంది, పోలీసులు బైండోవర్ చేశారు. అరుగురిని తహసీల్దార్ బైండోవర్ చేస్తూ సర్వే నెంబర్ 329లో నిర్మాణాలు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పటాన్చెరు తహసీల్దార్ ఆదేశాల మేరకు ఆర్ఐ ఖాజా శనివారం సిబ్బందితో కలిసి ప్లాట్లు కబ్జా చేస్తున్నవారి వద్ద ఉన్న పట్టాలను, ఇతర డాక్యుమెంట్లను పరిశీలించారు. దాదాపు 75మంది ప్లాట్లను, ఖాళీ జాగాను కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్నారని గుర్తించారు. వీరిలో కేవలం 19మంది వద్ద మాత్రమే 2008నాటి పట్టాలున్నాయి. మిగిలిన వారు నాయకుల ప్రోత్సాహంతోనే కబ్జాకు దిగినట్టుగా తేల్చారు. అధికారుల రిపోర్టు తహసీల్దార్ వద్దకు చేరింది. ఈ రిపోర్టు ఆధారంగా సర్వేనెంబర్ 329 పాత లేఔట్ పక్కనున్న మరో ఎకరన్నర భూమిని కొత్తగా కబ్జా చేసినట్టు గుర్తించారు. తహసీల్దార్ అక్కడ పనులు జరగకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారు. 2008లో ప్రభుత్వం పంపిణీ చేసిన పేదల ఇండ్ల పట్టాల కీ రిజిస్టర్ తహసీల్దార్ తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. కొందరు ప్రజలు నాటి లబ్ధిదారుల వద్ద పాత పట్టాలను కొని ఇండ్లను నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారని తేలింది. కొత్తగా కబ్జా చేస్తున్న వాటిలో అధికశాతం మాజీ ప్రజాప్రతినిధుల అనుచరులు, కార్యకర్తలు, బంధువులు ఉన్నట్టు సమాచారం. లేఔట్ పక్కన కొత్తగా కబ్జా చేస్తున్న స్థలంలోనూ 28మంది పునాదులు చేస్తున్నట్టుగా చూసి నివ్వెర పో యారు. పనులకు వాడుతున్న జేసీబీలను సీజ్ చేస్తామని యజమానులను హెచ్చరించి పంపించారు. ఇప్పటికైతే అక్కడ ఎలాంటి పనులు జరగకుండా చర్యలు తీసుకున్నారు.
పటాన్చెరు మండలం చిట్కుల్లో సర్వే నెంబర్ 329లో పాత పట్టాలు ఉన్నాయని కడుతున్న నిర్మాణాలపై అధికారులు విచారణ చేశారు. వాటిలో కేవలం 19 మంది మాత్రమే అర్హులు ఉన్నారని గుర్తించాం. దాదాపు 60 వరకు నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిసింది. త్వరలో వీటిపై విచారణ చేసి అర్హులకు న్యాయం చేస్తాం. తప్పుడు పత్రాలతో, అక్రమ దారుల్లో ఖాళీ జాగాలను కబ్జా చేసేందుకు ప్రయత్నించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సర్వే నెంబర్ 329 భూమిని కాపాడుతాం.