జహీరాబాద్, అక్టోబర్ 26 : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ కస్తుర్బాగాంధీ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రమైన దగ్గు, శ్వాసకోశ సమస్యలతో అస్వస్థతకు గురికావడంతో వారిని సంగారెడ్డి దవాఖానకు తరలించారు. వెంటనే న్యాల్కల్ పీహెచ్సీ వైద్యాధికారులు అమృత్‌రాజ్, గణపతిరావు పాఠశాలలో వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేసి విద్యార్థులందరికీ వైద్యపరీక్షలు నిర్వహించారు. పాఠశాలలో తాగునీరు, భోజనం, వంటనూనె తదితర వస్తువులకు నిర్వహించిన పరీక్షల ఫలితాలు నార్మల్‌గానే ఉన్నాయని, ముందుజాగ్రత చర్యగా విద్యార్థులు మాస్కులు ధరించాలని వైద్యులు సూచించారు.
పాఠశాలలో అదనపు గదులు, కలరింగ్ చేయడంతో విద్యార్థులు అస్వస్థతకు గురై ఉండవచ్చని వైద్యాధికారులు అనుమా నం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం పాఠశాలకు చెందిన 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో జహీరాబాద్ ఏరియా దవాఖానకు తరలించి వైద్యం అందించారు. విద్యార్థినులకు దగ్గు, శ్వాసకోశ సమస్యలు మరింత తీవ్రం కావడంతో సంగారెడ్డి దవాఖానకు తరలించారు. పీఏసీఎస్ చైర్మన్ సిద్ధిలింగయ్య స్వామి, బీజేపీ మండల నాయకులు ఓంకార్ యాదవ్, మల్లేశం, యువజన సంఘం నాయకులు పాఠశాలను సందర్శించి పాఠశాల ప్రత్యేకాధికారి రుబీనా పర్వీన్‌బేగంతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.