సిద్దిపేట, నవంబర్ 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారుపై రాష్ట్ర ప్రభుత్వం జీవో 46ను శనివారం విడుదల చేసింది. సర్పంచ్, వార్డు స్థానాల రిజర్వేషన్లకు విధివిధానాలు వెల్లడిస్తూ జీవో విడుదల చేసింది. ప్రభుత్వ అధికార యంత్రాంగం జీవోకు అనుగుణంగా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నది. నేడు, రేపు రెండు రోజుల్లో ఈ ప్రక్రయను పూర్తి చేయనున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో 50 శాతం రిజర్వేషన్లు మించకూడదు అని స్పష్టం చేసింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు రొటేషన్ పద్ధ్దతిలో అమలు చేయనున్నది. సామాజిక, ఆర్థిక, ఉపాధి రాజకీయ విద్య సర్వే 2024 ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించనున్నారు. కులగణన ఆధారంగా వార్డు సభ్యులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కల్పిస్తారు. కులగణన ఆధారంగా బీసీలకు సర్పంచ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్సిస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు సర్పంచ్ పదవులకు రిజర్వేషన్లు కల్పించనున్నారు.
సర్పంచ్ పదవులకు రిజర్వేషన్లను ఆర్డీవోలు ఖరారు చేస్తారు. వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఎంపీడీవోలు ఖరారు చేయనున్నారు. ఆయా రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ పద్ధ్దతి ద్వారా మహిళా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఎస్టీ రిజర్వేషన్లు మొదట చేసిన తర్వాత ఎస్సీ, బీసీలకు కేటాయిస్తారు.మహిళా రిజర్వేషన్ అన్ని కేటగిరీల్లో ప్రత్యేకంగా లెక్కించి అమలు చేస్తారు. గ్రామ పంచాయతీ/ వార్డుల సంఖ్య తక్కువైతే మొదట మహిళలకు తర్వాత లాటరీ పద్ధ్దతి అమలు చేస్తారు. గ్రామ సర్పంచ్ రిజర్వేషన్ 2011 జనగణనతో పాటు సెప్స్ డేటా వినియోగించుకుంటామని పేర్కొంది.
100 శాతం ఎస్టీ గ్రామాల్లో అన్ని వార్డులు, సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు మాత్రమే రిజర్వ్ చేసి ఉంటాయని జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. 2019 ఎన్నికల్లో అమల కాని రిజర్వేషన్లు అలాగే కొనసాగించవచ్చని జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. 2019 ఎన్నికల్లో సర్పంచ్ పదవులను ఎస్సీలకు 20.53 శాతం, ఎస్టీలకు 6.68 శాతం, బీసీలకు 22.78 శాతం ప్రకారం కేటాయించారు. 46 జీవోకు అనుగుణంగా అమలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. ఈనెల 24న హైకోర్టు తీర్పు అనంతరం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే విధంగా ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు రిజర్వేషన్లకు మార్గదర్శకాలు వెలువడడంతో పల్లెల్లో ఎన్నికల సందడి నెలకొంది. పోటీలో ఉన్న ఆశావహులు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే గ్రామాల్లో తిష్ట వేశారు. తాజాగా జీవో 46 విడుదల చేయడంతో ఆశావహులు రిజర్వేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. తాజగా విడుదల చేసిన జీవో తమకు అనుకూలంగా రిజర్వేషన్ వచ్చేనా.. రాదా..? అనే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని అన్ని గ్రామాల సర్పంచ్లు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియను ఈ రెండు రోజుల్లో పూర్తిచేసే విధంగా అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. రిజర్వేషన్ల ప్రక్రియపై గ్రామాల వారీగా పంచాయతీ కార్యదర్శుల నుంచి పూర్తి సమాచారాన్ని తెప్పించుకున్నారు. ప్రభుత్వం శనివారం మార్గదర్శకాలు విడుదల చేయడంతో దానికి అనుగుణంగా చేయనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి.