జహీరాబాద్, ఫిబ్రవరి 20: జహీరాబాద్ నియోజకవర్గంలోని ప్రధాన రోడ్డు మార్గమైన జహీరాబాద్-బీదర్ ఆర్అండ్బీ రోడ్డు మరమ్మతు పనులు నత్తనడకన సాగుతుండడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రోడ్డు మార్గంలోని పలు గ్రామాల సమీపంలోని రోడ్డుపై గుంతలు పడి వాహనచోదకులు ఇబ్బందులు పడుతుండడంతో మరమ్మతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధుల కింద రూ.5.60 కోట్లు మంజూరు చేసింది.
ఎనిమిది కిలోమీటర్ల దూరం మేరకు గుంతలుపడి పాడైన రోడ్డుకు మరమ్మతులు చేపడుతున్నారు. కొత్తూర్(బి) గ్రామ శివారులోని నారింజ వాగు ప్రాజెక్టు సమీపంతో పాటు న్యాల్కల్ మండలంలోని గంగ్వార్ చౌరస్తా సమీపంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఈ మార్గంలో పలుచోట్ల రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు.
వారం రోజులుగా తవ్విన రోడ్డు మార్గంలో ఎలాంటి మరమ్మతులు చేపట్టకుండా వదిలేశారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి ప్రతిరోజు ఈ రోడ్డు గుండా వందలాది వాహనాలు రోకపోకలు సాగిస్తుంటాయి. రోడ్డుపై భారీ వాహనాలు వెళ్తున్న సమయంలో విపరీతంగా దుమ్ములేస్తుండడంతో జనాలు బేజారవుతున్నారు.
దుమ్ము కారణంగా పాదచారులు ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితులు దాపురించాయి. భారీ వాహనాలు వెళ్తునప్పుడు ద్విచక్ర వాహనచోదకులకు రోడ్డు కనిపించని విధంగా దుమ్ము లేవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు విస్తరణ పనులు, మరమ్మతులు వేగవంతంగా చేపట్టాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.