Renuka Matha Ellamma | రామాయంపేట, ఫిబ్రవరి 11: రామాయంపేటలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ఘనంగా కల్యాణ మహోత్సవం జరిగింది. మంగళవారం మల్లిఖార్జున స్వామి జాతరలో భాగంగా ఆలయంలోని రేణుకాఎల్లమ్మకు పట్నాలు గీసి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. రామాయంపేట పట్టణ యాదవ సంఘం అధ్వర్యంలో నిర్వాహకులు రేణుకా ఎల్లమ్మకు పట్టువస్త్రాలను అందజేశారు. ఈ కల్యాణోత్సవానికి కుల బాంధవులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. డప్పు చప్పుళ్లతో ఎల్లమ్మ బోనాలను యాదవులు ఊరేగింపుగా దేవాలయానికి తీసుకొచ్చి అమ్మవారికి బోనాలు, మంద గంపలు సమర్పించారు. అమ్మవారి సన్నిదిలో ఒగ్గు కళాకారులు ఒగ్గు కధలు చెప్పారు. జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
మల్లన్న జాతరకు బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి చేరుకుని రేణుకా కళ్యాణంలో పాల్గొన్నారు. రేణుకా ఎల్లమ్మ దేవికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ర్యాలీగా వచ్చిన పద్మా దేవేందర్ రెడ్డి జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ది చేసింది మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ ఆధినేత కేసీఆరే నని పేర్కొన్నారు. జాతరలో సుమారు 5,000 మంది వరకు భక్తులు పాల్గొన్నట్లు నిర్వాహకులు అంచనా వేశారు. రామాయంపేట పట్టణంలోనే దేదీప్యమానంగా జరిగిన ఉత్సవాలకు పట్టణంతోపాటు చుట్టు ప్రక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుని మల్లన్న, ఎల్లమ్మలను దర్శించుకున్నారు.