పెబ్బేరు, జూన్ 19 : భీమా ఎత్తిపోతల పథకంలో భాగమైన శ్రీరంగాపురం రంగసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు బుధవారం సాగునీరు విడుదలైంది. కొత్తకోట మండలం అమడబాకుల వద్దనున్న ఎనుకుంట రిజర్వాయర్ నుంచి 15వ ప్యాకేజీ కాల్వ ద్వారా అధికారులు నీటిని విడుదల చేశారు. కృష్ణా బేసిన్లో అక్కడక్కడా వర్షాలు కురవడంతో రంగసముద్రానికి సాగునీటిని విడుదల చేసినట్లు భీమా ఈఈ కేశవరావు తెలిపారు. రిజర్వాయర్ పరిధిలోని చెరువులు, కుంటలను సైతం నింపే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఐదురోజుల పాటు నీటిని విడుదల చేసి రంగసముద్రాన్ని నింపుతామన్నారు. రంగసముద్రానికి సాగునీరు విడుదల కావడంతో ఆయకట్టు రైతులు కాల్వకు పూజలు చేశారు. భీమా ఎత్తిపోతల పథకంలో భాగంగా శ్రీరంగనాథ ఆలయానికి ఆనుకొని నిర్మించిన రంగసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పరిధిలో 20వేల ఎకరాల ఆయకట్టు సాగవుతున్నది.