
కట్టపడితే రోజు ఇంత రొక్కం చేతికి వత్తది.. అదే ఇంకేదైనా పంటేసిన ఐదునెల్లదాక రొక్కం చేతికి రాదు.. కూరగాయలు, పూలు పండించి అమ్మిన.. ఎన్నడూ నన్ను ముంచలే.. ఇప్పటికి కూడా కూరగాయలు పండిత్తన్న.. నాకు నలుగురు కూతుర్లు అయినప్పటికీ నలుగురిని సదివించిన…ముగ్గురు కూతుళ్ల పెండ్లీలు చేసిన.. కూరగాయలను పండించి రోజుకు నాలుగైదు వందలు సంపాదించడంతో మా కుటుంబమంతా మంచిగ బతుకుతున్నం.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన రైతు పెసరు బాలయ్య మనోగతం..
హుస్నాబాద్ టౌన్, జనవరి 1:వ్యవసాయానికి పెట్టుబడి ఎక్కువ.. కూరగాయల మీద పెట్టుబడి తక్కువ.. పైగా పదిరూపాయలు పెట్టుబడి పెడితే ఇరవై రూపాయలు సంపాదించొచ్చని నిరూపిస్తున్నాడు హుస్నాబాద్ పట్టణానికి చెందిన పెసరు బాలయ్య. పట్టణ శివారులో ఆయనకు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇరువై ఏండ్లుగా ఎకరానికిపైగా కూరగాయలు, పూలు సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వరి, మొక్కజొన్న తదితర పంటల కంటే కూరగాయల సాగుతోనే ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. –
ఎకరానికిపైగా కూరగాయల సాగు..
బాలయ్య తన నాలుగెకరాల పొలంలో దాదా పు ఎకరానికిపైగా కూరగాయలు సాగు చేస్తూ జీవ నం సాగిస్తున్నాడు. బొబ్బెరకాయ, బీర, సోరకా య, క్యారెట్, చిక్కుడు కాయ, కలగూర, గోంగూ ర, కాకరకాయ, బెండకాయ, వంకాయ, టమా ట, ఉల్లి, కొత్తిమీర తదితర కూరగాయలతో పా టు పసుపు, కనకంబరాలను సైతం సాగుచేస్తు న్నాడు. పైగా మామిడి, బొప్పాయి, అరటి, ము నగ తదితర వాటిని సైతం సంరక్షిస్తున్నాడు. ఇలా అన్నిరకాల కూరగాయలు, పండ్లు సైతం పండించే క్షేత్రంగా తీర్చిదిద్దాడు.
కూరగాయలతోనే బాగుపడింది
కూరగాయల సాగుతో మరో ఎకరం భూమిని సంపాదించుకున్నాడు. దీంతో పాటు నలుగురు కూతుర్ల్లను చదవించి, ఇందులో ముగ్గురి పెండ్లీ లు సైతం కూరగాయలతో వచ్చిన ఆదాయంతోనే చేయడం విశేషం. పండిన కూరగాయలను పట్టణంతో పాటు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ లాభాలు గడిస్తున్నాడు. పైగా తన ఇద్దరు కూతుర్ల్లు సైతం కూరగాయల వ్యాపారం చేస్తున్నారని వారికి సైతం తన భూమిలో పండించిన కూరగాయలనే సరఫరా చేస్తూ వారి వ్యాపార అభివృద్ధికి సైతం సహకరిస్తున్నాడు.
రోజుకు నాలుగైదు వందల సంపాదన..
రైతు పెసరు బాలయ్య తన క్షేత్రంలో పండించిన కూరగాయలను రోజు వారీగా విక్రయిస్తూ సంపాదిస్తున్నాడు. ఇక్కడ పండించిన కూరగాయలను ప్రతిరోజూ ఇంటికి తీసుకువెళ్లగా, బాలయ్య భార్య ఎల్లవ్వ ఇంటింటా తిరుగుతూ విక్రయిస్తుంది. ఆలాగే ఇద్దరు కూతుర్లు కూడా బాలయ్య కూరగాయలు అందిస్తుండటంతో వారు సైతం పట్టణంలో కూరగాయల విక్రయిస్తూ సంపాదిస్తున్నారు. ఇలా రోజుకు నాలుగైదువందల రూపాయల వరకు కూరగాయల మీదనే బాలయ్య కుటుంబం సంపాదిస్తున్నది. కేవలం మూడు నెలల్లో నలభైవేల రూపాయల దాక సంపాదించానని బాలయ్య గర్వంగా చెబుతున్నాడు. కూరగాయలు పండించినోల్లను ఎన్నడూ సెడగొట్టదంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.