అన్ని వర్గాల అభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జహీరాబాద్ మండలం హోతి(కే)గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను గురువారం ఎంపీ బీబీ పాటిల్, కలెక్టర్ శరత్‌కుమార్, ఎమ్మెల్యే మాణిక్ రావుతో కలిసి పరిశీలించారు. ఆరెకటిక భవనానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్న 700 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను త్వరలో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. సొంత జాగా ఉంటే ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం రూ. 3లక్షలు ఇస్తుందన్నారు. ఉమ్మడి పాలనలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయాయని విమర్శించారు. జహీరాబాద్ ప్రభుత్వ దవాఖానలో రూ. కోట్లు వెచ్చించి అత్యాధునికి పరికరాలను ఏర్పాటు చేశామన్నారు.రూ.15కోట్ల వ్యయంతో 50పడకల మాతాశిశు సంరక్షణ దవాఖానను నిర్మిస్తున్నామని తెలిపారు. మైనార్టీలకు మెరుగైన విద్యనందించేందుకు రూ.25కోట్లతో రెండు గురుకుల పాఠశాలలను నిర్మించామని గుర్తుచేశారు.
-జహీరాబాద్, కోహీర్, జూన్ 8
జహీరాబాద్/ కోహీర్, జూన్ 8: రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం జహీరాబాద్ పర్యటనలో భాగంగా హోతి(కే) గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ గతంలో 300 మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అందజేశామన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో 700 ఇండ్లను మరో 45 రోజుల్లో నిర్మాణాన్ని పూర్తి చేసి పేదలకు పంపిణీ చేస్తామని వెల్లడించారు. సొంత ఇంటి స్థలం ఉన్న వారు ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షలు ఇస్తామన్నారు. జహీరాబాద్ నియోజక వర్గానికి 3,000 ఇండ్లను వారంలో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తాగేందుకు మంచి నీళ్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. తాగు నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తే మహిళలు బిందెలతో కొట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. సీఎం కేసీఆర్ పేదల కష్టాలు గుర్తించారన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగు నీటిని అందిస్తున్నారన్నారు. కర్ణాటకలోని బీదర్‌లో మూడు రోజులకు ఒకసారి, షోలాపూర్‌లో పది రోజులకోసారి తాగునీరు వస్తున్నదన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రసవం అయితే రూ.40 నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేయాల్సి వచ్చేదని, ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా కాన్పులు చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా గర్భిణుల కోసం కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ ప్రారంభిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని ఆరు లక్షల మంది గర్భిణులకు ఏడాదికి రెండు సార్లు ఈ కిట్లను అందజేస్తామన్నారు. పేదల కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌ను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఆర్డీవో, డీఎస్పీ కార్యాలయాలను ఏర్పాటు చేశామన్నారు.
మాతా శిశు సంరక్షణ దవాఖానకు రూ.15 కోట్లు
జహీరాబాద్ ప్రభుత్వ దవాఖానలో డయాలసిస్, ఐసీయూ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. గర్భిణులు ప్రైవేటు దవాఖానలో పరీక్ష చేయించుకుంటే 1500 నుంచి రూ.2 వేల వరకు ఖర్చు అవుతుందన్నారు. ఎంపీ బీబీ పాటిల్ సూచనల మేరకు అల్ట్రాసౌండ్ మిషన్ కొనుగోలు చేసి ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. రూ.15 కోట్లతో 50 పడకల మాతా శిశు సంరక్షణ దవాఖాన నిర్మిస్తున్నామన్నారు.
అన్ని కులాలకు ఆత్మ గౌరవ భవనాలు
సీఎం కేసీఆర్ నేతృత్వంలో అన్ని కులాల ఆత్మ గౌరవం కోసం భవనాలు నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌తో పాటు ప్రతి నియోజక వర్గంలో ఈ భవనాలు కట్టిస్తున్నామన్నారు. గతంలో పద్మశాలి భవనం కోసం 32 గుంటల భూమి, రూ.25 లక్షలు కేటాయించామన్నారు. సంఘం నాయకుల విన్నపం మేరకు మరో రూ.50 లక్షలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆరె కటిక భవనానికి 20 గుంటల భూమి, రూ.10 లక్షలు, జంగమ, గౌడలకు 10 గుంటల చొప్పున, మున్నూరు కాపులకు ఆరు గుంటల భూమిని కేటాయించామన్నారు.
ముస్లింలకు ప్రాధాన్యం
జహీరాబాద్‌లో ముస్లింల శ్మశానవాటిక కోసం ఐదెకరాల స్థలం కేటాయిస్తామన్నారు. విద్యార్థులు చదివేందుకు రూ.25 కోట్లతో రెండు మైనార్టీ గురుకుల పాఠశాలలు నిర్మించామన్నారు. దీంతో ఉన్నత విద్య లభిస్తుందన్నారు. గురుకుల స్థాయి నుంచి డిగ్రీ వరకు ఉచితంగా విద్యాభ్యాసం చేయిస్తున్నామని చెప్పారు. షాదీఖానా, హజ్ హౌస్ నిర్మాణం శరవేగంగా కొనసాగుతున్నదని, త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర హాండ్లూమ్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ చింతా ప్రభాకర్, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్‌రావు, కలెక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు: ఎంపీ బీబీ పాటిల్
హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఆత్మ గౌరవ భవనాలు నిర్మిస్తున్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. అన్ని కులాలకు సమ ప్రాధాన్యతనిస్తున్నారు. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకం అందించి దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచారు. రైతులకు అనేక పథకాలు అందిస్తున్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న ఇంతమంచి పనులను నీతి ఆయోగ్ కూడా గుర్తించింది.
అన్ని కులాలకు భవనాలు: ఎమ్మెల్యే మాణిక్‌రావు
అన్ని కులాలకు సొంత భవనాలు నిర్మించేందుకు భూములు, నిధులు ఇస్తున్నాం. బిడ్డ పుట్టినప్పటి నుంచి ప్రభుత్వం ఆదుకుంటున్నది. అడుగక ముందే అన్ని సమకూరస్తున్నది. ఇంత మంచి ప్రభుత్వానికి మరోసారి అండగా నిలబడాలి.