మెదక్, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలోని మెదక్, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, కొల్చారం, రామాయంపేట ప్రాంతంలో రేషన్ బియ్యం అక్రమ దందా జోరుగా సాగుతున్నది. రేషన్ బియ్యాన్ని రైస్‌మిల్లు వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేసి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఏప్రిల్‌లో ప్రభుత్వం మూడు నెలలకు సంబంధించిన బియ్యం ఒకేసారి సరఫరా చేస్తుండగా, పేదల నుంచి తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేసి రైస్‌మిల్లు వ్యాపారులకు అమ్మకాలు చేస్తున్నారని తెలిసింది. మెదక్ నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా మహారాష్ట్ర, గుజరాత్, ఇతర రాష్ర్టాలకు తరలిస్తున్నారు.
మెదక్ జిల్లాలో 520 రేషన్ షాపులు
మెదక్ జిల్లాలో 520 రేషన్ షాపులు ఉన్నాయి. జిల్లాలో 2,39,217 రేషన్ కార్డులు ఉన్నాయి. అంత్యోదయ కార్డులు 13,886, ఆహార భద్రత కార్డులు 2,25,266, అన్నపూర్ణ కార్డులు 65 ఉన్నాయి. రేషన్ కార్డుల్లో 7,81,389 మంది సభ్యులు ఉన్నారు. మెదక్ జిల్లాలో ప్రతినెలా రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం 4,949,5 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నది. శంకరంపేట(ఏ),చేగుంట, పాపన్నపేట, మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్‌లో రేషన్ బియ్యం పంపిణీ గోదాములు ఉన్నాయి. ఇక్కడి నుంచి ప్రతినెలా రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేస్తారు. ప్రస్తుతం ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించిన రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు 11 కేసులు నమోదు చేసి, 2340.55 క్వింటాళ్ల బియ్యం, 10వాహనాలను అధికారులు సీజ్ చేశారు. మెదక్, పెద్దశంకరంపేట, రామాయంపేట, అల్లాదుర్గం, తూప్రాన్, నర్సాపూర్, కొల్చారం నుంచి రోజూ రైస్‌మిల్లు వ్యాపారులు అక్రమంగా రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి అమ్మకాలు చేస్తున్నారని తెలిసింది. వ్యవసాయ క్షేత్రాల్లో ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేసి రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తున్నారు. మరికొందరు గ్రామాల్లోని ఇండ్లల్లో నిల్వ చేసి ఆటోలు, మినీ గూడ్స్ వాహనాల్లో తరలిస్తున్నారు. రేషన్ బియ్యం నిల్వ చేసే వ్యాపారులు ప్రతినెలా రెవెన్యూ, పోలీస్, విజిలెన్స్, పౌర సరఫరాల శాఖ అధికారులకు భారీగా ముడుపులు అప్పుగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
రేషన్ డీలర్ల దోపిడీ
రేషన్ షాపు డీలర్లు బియ్యం తూకం వేసే సమయంలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తూకంలో ఒకటి నుంచి రెండు కిలోల వరకు మోసం చేస్తున్నారు. బియ్యం తూకం వేసే సమయంలో ఎక్కువ బరువు ఉన్న బస్తాలో బియ్యం తూకం వేస్తున్నారు. లబ్ధిదారులు తీసుకుపోయిన బస్తాలో బియ్యం తూకం వేయడం లేదు. దీంతో పాటు తూకం వేసే సమయంలో వినియోగదారుడి కండ్లు గప్పి మోసం చేస్తున్నారు. కొందరు రేషన్ డీలర్లు అక్కడే లబ్ధిదారుల నుంచి ధర నిర్ణయించి బియ్యం కొంటున్నారు. వాటిని మిల్లులకు తరలించి ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు.
చర్యలు తీసుకుంటాం
మెదక్ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ దందాపై విచారణ చేస్తాం. రేషన్ బియ్యంతో తరుచూ పట్టుబడిన వ్యాపారు లపై కేసులు నమోదు చేయించి కఠిన చర్యలు తీసుకుం టాం. పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల సమన్వ యంతో రేషన్ అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటాం. జనవరి నుంచి ఏప్రిల్ వరకు 11 కేసులు నమోదు చేశాం. అక్రమంగా తరలిస్తున్న 2340.55 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నాం. రేషన్ డీలర్లు తూకంలో మోసాలపై విచారణ చేసి అక్రమాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేస్తాం.
-నిత్యానందగౌడ్, జిల్లా పౌరసరఫరాల
శాఖ అధికారి (మెదక్)