జహీరాబాద్, జూన్ 5 : కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. రేషన్ పొందడానికి అటు లబ్ధిదారులు, పంపిణీ చేయడానికి ఇటు డీలర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ-పాస్ యంత్రాల ద్వారా బియ్యం పంపిణీకి ఆరుసార్లు బయోమెట్రిక్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుండడంతో లబ్ధిదారులు , డీలర్లకు ఇబ్బందులు ఎదురవుతునన్నాయి. సాంకేతిక సమస్యలతో మూడు నెలల బియ్యం పంపిణీకి ఒక్కో వినియోగదారుడికి 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతున్నది.
ఉదాహరణకు ఒక కుటుంబంలో నలుగురు సభ్యులు ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారుడికి మూడు నెలలకు సంబంధించి 72 కిలోల బియ్యం పంపిణీ చేయాల్సిన ఉంది. ఈ-పాస్ యంత్రాం ద్వారా మూడు నెలలకు సంబంధించి 72 కిలోలు పంపిణీ చేస్తున్నట్టు రసీదు వస్తుంది. కానీ, ఈ-పాస్ యంత్రంలో మాత్రం 60 కిలోలు పంపిణీ చేసినట్టు నమోదవుతున్నది. ఆన్లైన్లో 12 కిలలు రేషన్ షాపునకు కేటాయించిన స్టాక్‌లో కట్ కాకపోవడంతో తమపై భారం పడుతుండడంతో డీలర్లు లబోదిబోమంటున్నారు.
ఇలా పంపిణీ చేస్తుండడంతో అన్లైన్లో రేషన్ షాపునకు కేటాయించిన స్టాక్‌లో లబ్ధిదారుడికి పంపిణీ చేసిన రేషన్ బియ్యం మొత్తం వివరాలు చూపడం లేదు. చివరికి గ్రామాల్లో బియ్యం తీసుకోకుండా మిగిలిపోయిన లబ్ధిదారులకు ఎక్కడ నుంచి బియ్యాన్ని తెచ్చి ఇవ్వలో అర్ధం కావడం లేదని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలకు సంబంధించిన బియ్యం పంపిణీలో నెలకొన్న సాంకేతిక, నెట్వర్క్ సమస్యలను తొలిగించే వరకు రేషన్ బియ్యం పంపిణీని న్యాల్కల్ మండలంలోని పలు గ్రామాలల్లో రేషన్ డీలర్లు నిలిపివేశారు. దీనికి తోడుగా చినిగిన సంచుల్లో బియ్యాన్ని షాపులకు సరఫరా చేయడంతో బియ్యం తక్కువ వచ్చి పంపిణీలో ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు.
లారీల్లో లోడింగ్, రేషన్ షాపులో అన్లోడింగ్ చేసే సమయంలో బియ్యం కింద పోయి తక్కువగా వస్తున్నాయని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం దృష్ట్యా జూన్,జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రేషన్ షాపులో లబ్ధిదారులు వేలిముద్రలు వేయడం, నూతన స్మార్ట్ పీడీఎస్ సాఫ్ట్వేర్ ఉపయోగించాల్సి రావడంతో డీలర్లు, లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
తరుచుగా సర్వర్ మొరాయించడంతో పంపిణీకి జ్యాపం జరుగుతున్నది. గంటల తరబడి రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులు బారులు తీరాల్సి వస్తున్నది. జహీరాబాద్ నియోజకవర్గంలోని చాలా రేషన్ షాపులు పూర్తిస్థాయిలో రేషన్ బియ్యం చేరుకోలేదు. ఇప్పటికేనా సంబంధిత జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకొని రేషన్ బియ్యం పంపిణీ సజావుగా జరిగేలా చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఈ- పాస్ యంత్రాల్లో నెలకొన్న సాఫ్ట్వేరు సమస్యలను పరిష్కరించాలని రేషన్ డీలర్లు కోరుతున్నారు.
హుస్నాబాద్ మండలంలో…
హుస్నాబాద్‌టౌన్, జూన్ 5: మూడు నెలల రేషన్ బియ్యం పొందేందుకు ప్రజలు గంటలతరబడి రేషన్ దుకాణాల ఎదుట పడిగాపులు పడాల్సి వస్తున్నది. హుస్నాబాద్‌తో పాటు పలు గ్రామాల్లో రేషన్ సరుకుల కొరకు ప్రజలు ఒక రోజంతా ఆయా పంపిణీ కేంద్రాల వద్ద నీరీక్షిస్తే తప్ప బియ్యం తెచ్చుకోలేని పరిస్థితి కనిపిస్తున్నది. నెలనెలా బియ్యం కొరకు వేలిముద్రలు వేయాల్సివస్తున్నదని, కొన్నిమార్లు సాంకేతిక కారణాలతో వేచిచూడాల్సి వస్తుందని పలువురు వాపోయారు. దుకాణాదారులు సైతం మూడు మాసాల బియ్యం ఇచ్చేందుకు తూకం వేసేందుకు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రేషన్ బియ్యం కోసం సంచులతో క్యూ
అక్కన్నపేట, జూన్ 5: రేషన్ బియ్యం పొందడానికి కార్డుదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని రేషన్ దుకాణం షాపు నంబర్ 3804005 వద్ద గురువారం బియ్యం కోసం తెచ్చుకున్న సంచులు, రేషన్ కార్డులతో లబ్ధిదారులు క్యూకట్టారు. జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన బియ్యం కోటాను ఒకేసారి ఇస్తుండడంతో క్యూలో నిరీక్షించాల్సి వస్తున్నది. ఇబ్బందులు లేకుండా రేషన్ పంపిణీకి ఏర్పాట్లు చేయాలని సివిల్ సైప్లె, రెవెన్యూ అధికారులను లబ్ధిదారులు కోరుతున్నారు.