కోహెడ, సెప్టెంబర్ 23: కండ్లతోటి చూదామంటే బతికున్నప్పుడు రాలేదు. ఇనాళ్లకు శవమై వస్తున్నావా రామచంద్రా అంటూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ అయిన ఖాతా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ తల్లిదండ్రులు ఖాతా మల్లారెడ్డి, వజ్రమ్మ కంట తడి పెట్టుకుంటున్నారు. తమ కొడుకు సోమవారం ఎన్కౌంటర్లో మృతిచెందాడని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు విని రోదించారు. 35ఏండ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిన రామచంద్రారెడ్డి తిరిగి ఇంటివైపు చూడలేదు.
ఒకటి నుంచి 3వ తరగతి వరకు స్వగ్రామం సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లిలో చదివారు. అనంతరం 4 నుంచి పదో తరగతి వరకు కోహెడ ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ఇంటర్మీడియెట్ సిద్దిపేట ప్రభుత్వ కళాశాలలో చదివాడు. అనంతరం వరంగల్‌లో టీటీసీ చేసి 1983లో కాటారం మండలం పెంచికల్‌పేటలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చేరాడు. ఆ తర్వాత కాటారం మండలంలోని వరికోలు గ్రామానికి బదిలీ అయ్యాడు.
కొన్ని రోజులు సిద్దిపేటలోని వాణి నికేతన్ పాఠశాలలో ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఇదే సమయంలో వడ్డేపల్లి శాంతి అనే అమ్మాయి పరిచయం కాగా, స్టేజీ మ్యారేజ్ చేసుకున్నాడు. తదుపరి ఔరంగాబాద్‌లో ఎల్ఎల్బీ చేసేందుకు వెళ్లి, అక్కడే నక్సలైట్ గ్రూప్‌లతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని అజ్ఞాతంలోకి వెళ్ల్లిపోయాడు. ఇతనికి కూతురు స్నేహచంద్ర, కుమారుడు రాజాచంద్ర ఉన్నారు. రామచంద్రారెడ్డి కూతురు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నది. కుమారుడు ఎల్ఎల్బీ పూర్తి చేసి అదే కళాశాలలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నది.