సంగారెడ్డి జనవరి 2 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తనపై ఉన్న రాజకీయ కక్షతో అందోలు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని అందోలు మాజీఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం అందోలు నియోజకవర్గ అభివృద్ధికి వందల కోట్ల నిధులు మంజూరు చేసిందనన్నారు. ఇటీవల మంజూరైన నిధుల్లో రూ.350 కోట్ల పనులు పూర్తి కాగా, ఇంకా రూ.100 కోట్లకుపైగా పనులు వేర్వేరు దశల్లో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అయితే ఈ పనులు నిలిపివేయాలని మంత్రి అధికారులకు మౌఖిక ఉత్తర్వులు ఇచ్చారని, దీంతో రూ.90 కోట్ల పనులు నిలిచిపోయినట్లు చెప్పారు. తనపై ఉన్న కక్షతో అందోలు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగకుండా అడ్డుకోవడం అన్యాయమన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అందోలు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ముఖ్యంగా అందోలు నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి, గ్రామాల్లో సీసీరోడ్లు, మురికి కాల్వల నిర్మాణం కోసం పెద్దమొత్తంలో నిధులు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ పనులు పూర్తి కాకుండా మంత్రి ఆడ్డుకుంటున్నారని ఆరోపించారు. దీంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయన్నారు.
అభివృద్ధి పనులు నిలిపివేత
అందోలు నియోజకవర్గంలో రూ.90 కోట్లకుపైగా విలువైన పనులు నిలిచిపోయాయని మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ తెలిపారు. పంచాయతీరాజ్‌కు సంబంధించి రహదారులు, కమ్యూనిటీ హాళ్లు, గ్రామాల్లో సీసీరోడ్లు, మురుగుకాల్వల పనులకు సంబంధించి రూ.60 కోట్ల విలువైన పనులు నిలిపివేసినట్లు చెప్పారు. అందోల్ మండలంలో ఐదు, పుల్కల్లో ఆరు, వట్పల్లి మండలంలో ఏడు, రాయికోడ్‌లో 14, అల్లాదుర్గంలో ఏడు, టేక్మాల్‌లో 22 రకాల అభివృద్ధి పనులు నిలిపివేసినట్లు చెప్పారు.ఆర్‌అండ్‌బీలో రూ.10కోట్ల విలువైన రహదారుల నిర్మాణం, మరమ్మతు పనులు నిలిపివేసినట్లు చెప్పారు. చాలాపనులకు సంబంధించి టెండర్లు పూర్తి అయినా పనులు కాకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. ఎమ్మెల్యేకు సంబంధించిన నియోజకవర్గ అభివృద్ధి నిధులు(సీడీపీ)లో రూ.3 కోట్ల విలువైన పనులు జరగకుండా నిలిపివేసినట్లు చెప్పారు. ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్)లో రూ.9 కోట్ల విలువైన పనులు జరగకుండా నిలిపివేశారన్నారు.
ఎంపీ, ఎమ్మె ల్సీ కోటాలో విడుదలైన రూ.2 కోట్ల పనులు, డీఎంఎఫ్‌లో మంజూరైన రూ.3 కోట్ల విలువైన పనులు పూర్తి కానివ్వకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. అం దోలు మున్సిపాలిటీల్లో రూ.25 కోట్ల అభివృద్ధి పనులు జరగనీయడంలేదని, టెండర్లు నిర్వహించకుండా మంత్రి దామోదర అడ్డుపడుతున్నారని ఆరోపించారు. మంత్రి తనపై ఉన్న రాజకీయ కక్షతో అందోలు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగకుండా అడ్డుపడటం సరికాదన్నారు. మంత్రి హోదాలో అందోలు నియోజకవర్గానికి మరింత నిధులు తీసుకురావాలే తప్పా గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులు జరగకుండా అడ్డుకోవటం అన్యాయమన్నారు. మంత్రి వెంటనే కేసీఆర్ ప్రభుత్వం హయాంలో మంజూరైన అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. అందోలు నియోజకవర్గ అభివృద్ధికి తాను సంపూర్ణంగా సహకరిస్తానని చంటి క్రాంతికిరణ్ తెలిపారు. విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు సాయికుమార్, నారాయణ, విఠల్, విజయ్, వీరారెడ్డి, లింగాగౌడ్, బత్తులవీరన్న, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.