రాయపోల్, నవంబర్ 28: రాయపోల్ రెవెన్యూ కార్యాలయంలో సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో పాటు పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. దీంతో వివిధ పనుల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలు చెట్ల కింద పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. రోజూ 11 గంటల తర్వాత కార్యాలయానికి వచ్చి ప్రజా సమస్యలు పట్టించుకోకుండా వారి పనులు చూసుకొని తీరిగ్గా ప్రజా సమస్యలపై స్పందిస్తారు. అప్పటికప్పుడు పరిష్కరించే పనులను కూడా రోజుల తరబడి ప్రజలను కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు.
ఉదయం 10:30 గంటలకు రావాల్సిన అధికారులు అంతా.. మా ఇష్టాం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రాయపోల్ రెవెన్యూ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న తహసీల్దార్ నుంచి కిందిస్థాయి సిబ్బంది కూడా సమయపాలన పాటించడం లేదు. రోజుల తరబడి 11 గంటలు దాటినా అధికారులు మాత్రం కార్యాలయానికి రావడం లేదు. 12 గంట లు దాటిన తర్వాత ఒక్కొక్కరు కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకొని సిబ్బంది సమయపాలన పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.