సంగారెడ్డి, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లా రైతులకు ఈ వానకాలం కలిసి రావడం లేదు. జిల్లాలో సీజన్ ఆరంభంలో వర్షాలు మురిపించి ఆ తర్వాత క్రమంగా ముఖం చాటేశాయి. దీంతో పంటల సాగు విస్తీర్ణం లక్ష ఎకరాల వరకు తగ్గింది. ఇటీవల తుఫాను ప్రభావంతో వర్షాలు కురిసినప్పటికీ ఆశించిన స్థాయిలో సాగు విస్తీర్ణం పెరగలేదు. గత వానకాలం సంగారెడ్డి జిల్లాలో 7,19,525 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈసారి ఇప్పటి వరకు 5,67,559 ఎకరాల్లో మాత్రమే రైతులు పంటలు వేశారు. వరి సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ జిల్లాలో అన్ని పంటల సాగు విస్తీర్ణం కేవలం 6 లక్షల ఎకరాలకు మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి ఉంది.గత వానకాలంలో 7.19 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.
వర్షాభావం, రైతుబంధు ఇవ్వక పోవడం, సకాలంలో విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేకపోవడం, కరెంటు కోతలు, ప్రాజెక్టులు, చెరువుల్లో నీరు లేకపోవడం వంటి కారణాలతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. కరెంటు కోతల కారణంగా రైతులు బోరుబావుల కింద చెరుకు, వరి, కూరగాయల సాగు తగ్గించారు. సింగూరు ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయకపోవడంతో కాల్వల కింద రైతులు ఆశించిన స్థాయిలో వరి సాగుచేయలేదు.
వ్యవసాయశాఖ అంచనాలకు అనుగుణంగా వానకాలం సాగు జిల్లాలో జరగలేదు. ప్రస్తుత సీజన్లో సంగారెడ్డి జిల్లాలో 7,22,920 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. వర్షాభావం ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడంతో 5,67,559 ఎకరాల్లోనే రైతులు పంటలు వేశారు. వరినాట్లకు మినహా మిగతా పంటల సాగుకు సమయం మించిపోయింది. దీంతో జిల్లాలో ఈ సీజన్లో 6.50 లక్షల ఎకరాలకు సాగు పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి.
వానకాలం సీజన్లో ప్రధానంగా పత్తి, కంది, చెరుకు ఎక్కువగా సాగుచేస్తారు. ప్రస్తుతం ఈ సీజన్లో ఈ పంటల సాగు ఆశించిన స్థాయిలో జరగలేదు. సంగారెడ్డి, అందోలు, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో ఎక్కువగా పత్తి సాగు అవుతున్నది. 3.60 లక్షల ఎకరాల్లో పత్తి సా గు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేయగా, 3.35 లక్షల ఎకరాలకు పరిమితమైంది. 79,500 ఎకరాల్లో కంది సాగు అవుతుందని అంచనా వేయగా, 68వేల ఎకరాల్లో వేశారు. మిగతా పంటలు సైతం ఆశించిన స్థాయి లో వేయలేదు.
1.50 లక్షల ఎకరాల్లో వరి సాగు కావా ల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 36,705 ఎకరాల్లో మాత్రమే సాగైంది. 14,200 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేస్తారని అంచనా వేయగా, 8544 ఎకరాలకే పరిమితమైంది. 77,600 ఎకరాల్లో సోయా సాగు కావాల్సి ఉండగా, 66,375 ఎకరాల్లో ఈ పంట వేశారు. 25వేల ఎకరాల్లో చెరుకు సాగు కావాల్సి ఉండగా, 14,572 ఎకరాల్లో పంట వేశారు. జిల్లాలో ప్రధాన పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. గత సీజన్‌తో పోలిస్తే పెసర, మినుము పంటల సాగు స్వల్పంగా పెరిగింది.
వర్షాభావానికి తోడు ప్రధానంగా రైతుబంధు పథకం నిలిపివేయడం వానకాలం పంటల సాగుపై ప్రభావాన్ని చూపింది. కేసీఆర్ సర్కార్ ఏటా వానకాలం, యాసంగి సీజన్లో రైతులకు ముందస్తుగానే రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందజేసేది. జిల్లాలోని ప్రతిరైతుకు ఎకరాకు రూ.5వేల చొప్పున రైతుబంధు డబ్బులు ఖా తాల్లో వేసేది.
జిల్లాలో 2018 నుంచి 2023-24 వరకు 12 విడతల్లో 3,28,996 మంది రైతులకు కేసీఆర్ సర్కార్ రూ.4059 కోట్లు పెట్టుబడి సాయంగా అందజేసింది. గతేడాది వానకాలం సీజన్లో 3,59, 010 మం ది రైతులకు రూ.375 కోట్లు రైతుబంధు అందజేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు(రైతుభరో సా) ఇవ్వక పోవడంతో చాలామంది రైతులు పెట్టుబడి లేక సాగుకు వెనకడుగు వేయడంతో పంటల విస్తీర్ణం తగ్గింది.