సంగారెడ్డి, జనవరి 29(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాకు రైల్వేలైన్ మంజూరు చేయకపోగా జిల్లాలోని రైల్వే రిజర్వేషన్ కౌంటర్లను ఎత్తివేసేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. సంగారెడ్డి వరకు మెట్రోరైలు విస్తరిస్తామని, సంగారెడ్డి జిల్లాకు రైల్వేలైన్ తీసుకువస్తామని ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థులు ప్రచారం చేశారు. బీజేపీని గెలిపిస్తే సంగారెడ్డి జిల్లాకు మెట్రో, రైల్వేలైన్ వస్తుందని ఆశపడిన జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఓటర్లు కమలం పార్టీకి ఓట్లు వేశారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఓటర్లు బీజేపీని గెలిపించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది సమీపిస్తున్నా సంగారెడ్డి జిల్లాకు కొత్త రైల్వేలైన్, మెట్రో రైలుకు మోక్షం రాలేదు.
ఇప్పుడు ఏకంగా జిల్లాలోని రైల్వే రిజర్వేషన్ కౌంటర్లను ఎత్తివేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. రైల్వేలైన్‌ను నోచుకోని జిల్లా ప్రజలకు రైలు ప్రయాణాన్ని సైతం దూరం చేస్తున్నది. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, జోగిపేట పోస్టాఫీసుల్లో ఉన్న రైల్వే రిజర్వేషన్ కౌంటర్లను సౌత్ సెంట్రల్ రైల్వే ఎత్తివేసేందుకు సిద్ధమైందని, త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నట్లు తెలిసింది. ఇది వరకే సంగారెడ్డి, జోగిపేట పోస్టల్ సిబ్బంది ద్వారా నిర్వహిస్తున్న రైల్వే టికెట్ బుకింగ్ సేవలను రైల్వేశాఖ నిలిపివేసింది. దీంతో రైలు ప్రయాణికులు ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. ఆన్లైన్లో చాలామంది టికెట్లు లభించడం లేదు. దీంతో చాలామంది ప్రయాణికులు అదనంగా డబ్బులు వెచ్చింది ట్రావెల్ ఏజెంట్ల ద్వారా రైలు టికెట్లు కొనుక్కుంటున్నారు.
మొదటి నుంచి జిల్లాపై రైల్వేశాఖ శీతకన్ను
రైల్వేశాఖ మొదటి నుంచి సంగారెడ్డి జిల్లాపై శీతకన్ను చూపుతున్నది. సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ మీదుగా రైల్వేలైన్ ఉంది. సంగారెడ్డి, జోగిపేట,నారాయణ ప్రాంతం గుండా రైల్వేలైన్ వేయాలని ఈ ప్రాంత ప్రజలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా జిల్లా ప్రజల రైల్వేకల నెరవేరడం లేదు. ప్రతి పార్లమెంట్ ఎన్నికల్లో రైల్వే అంశం ప్రచారానికి పరిమితం అవుతున్నది తప్పా ఆచరణకు నోచుకోవడం లేదు. గతం లో సంగారెడ్డి, అందోలు, నారాయణఖేడ్ ప్రాంత ప్రజలు రైల్ రిజర్వేషన్ కోసం లింగంపల్లి రైల్వేస్టేషన్ లేదా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళాల్సి వచ్చేది. కనీసం సంగారెడ్డిలో రైల్ టికెట్ రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని దీంతో జిల్లా ప్రజలు డిమాండ్ చేశారు.
దీంతో దక్షిణ మధ్య రైల్వే 2010లో సంగారెడ్డి ఐటీఐలో టికెట్ కౌంటర్‌ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కొంతకాలానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆ కౌంటర్‌ను ఎత్తివేశారు. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ కోసం సంగారెడ్డి ప్రజలు తిరిగి డిమాండ్ చేయడంతో పోస్టాఫీసుల్లో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ఏర్పాటుకు దక్షిణ మధ్య రైల్వే ముందుకు వచ్చింది. 2013-14లో జోగిపేట పోస్టాఫీసులో రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌ను ప్రారంభించింది. 2014-15లో సంగారెడ్డిలో రైల్వే రిజర్వేషన్ కౌంటర్లను ఏర్పాటు చేసింది. పోస్టాఫీసు సిబ్బంది ద్వారా వీటి నిర్వహణ జరుగుతుంది. సంగారెడ్డి ప్రాం తం నుంచి వివిధ ప్రాంతాలకు రైలులో ప్రయాణించే ప్రజలు జోగిపేట, సంగారెడ్డి పోస్టాఫీసుల్లో ముందస్తుగా టికెట్లు తీసుకునేవారు. అలాగే తత్కాల్ టికెట్లు కొనుగోలు చేసేవారు. సంగారెడ్డి ప్రాంతంలో ప్రయాణికులతో పాటు వివిధ పరిశ్రమల్లో పనిచేసే ఉత్తరాదికి చెందిన కార్మికులు, ఆర్మీ అధికారులు, సిబ్బంది, సంగారెడ్డి పోస్టాఫీసులో రైల్వే రిజర్వేషన్ చేసుకునేవారు.
దక్షిణ మధ్య రైల్వే సంగారెడ్డి, జోగిపేట పోస్టాపీసుల్లోని రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల మూసివేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. సంగారెడ్డి, జోగిపేట పోస్టాఫీసుల్లోనూ కొద్దిరోజులుగా రైలు రిజర్వేషన్ సేవలను నిలిపివేసింది. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ఎత్తివేసేందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఈ ప్రాంత ప్రజలు లింగంపల్లి, సికింద్రాబాద్ వెళ్లి తత్కాల్, ఇతర టికెట్లు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో రైలు టికెట్లు రిజర్వు చేసుకోవడం ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారుతుంది. ప్రైవేటు ట్రావెల్ ఏజెంట్ల దగ్గర రైలుటికెట్లు కొనుగోలు చేయడం ప్రయాణికులకు అదనపు భారం అవుతుంది. రైల్వే రిజర్వేషన్ కౌంటర్లను యథావిధిగా కొనసాగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.