మిరుదొడ్డి, జనవరి 14: అక్బర్పేట-భూంపల్లి మండలంలోని వీరారెడ్డిపల్లి-జంగపల్లి గ్రామాల శివారులోని బండపై వెలసిన బండ మల్లన్న భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. బండ మల్లన్న బండ పై ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ రోజు వందలాది సంవత్సరాల నుంచి బండ మల్లన్న జాతర కొనసాగుతున్నది. దాదాపు 120 ఎకరాల విస్తీర్ణం కలిగి 116 గజాల ఎత్తున్న బండపై పరమేశ్వరుడు మల్లన్న దేవుడిగా అవతరించాడని ఈ ప్రాంత ప్రజల విశ్వాసం.
బండపై వెలసిన దేవతా మూర్తులు
విశాలమైన విస్తీర్ణంతో కలిగిన మల్లన్న బండపై శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, పాండవుల విగ్రహాలు, శ్రీ హనుమాన్ దేవాలయం, శ్రీ నాగదేవత ఆలయం,
శ్రీ పోశమ్మ దేవాలయంతో పాటు పుట్టు గుండం, మల్లన్న పాదముద్రలతో పాటు ఎన్నో దేవత విగ్రహాలు భక్తులకు దర్శనమిస్తున్నాయి.
వారం ముందు నుంచే సంబురాలు
ప్రతి సంవత్సరం జనవరి మొదటి వారంలోనే ఆయా గ్రామాల్లో బోనాలతో ప్రారంభమైన సంక్రాంతి పండుగ వరకు సంబురాలు జరుగుతూనే ఉంటాయి. బండ మల్లన్న చుట్టూ ఉన్న గ్రామాలు వీరారెడ్డిపల్లి, జంగపల్లి, అల్మాజీపూర్, చెప్యాల, దౌల్తాబాద్ మండలంలోని గాజులపల్లి గ్రామాలకు చెందిన బోనాల బండ్లు బండపై కొలువు దీరిన మల్లన్న దేవాలయం చుట్టూ ఐదుసార్లు ప్రదక్షిణ చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నది.
పుట్టు గుండం ప్రత్యేకత
బండ పై సహజ సిద్ధంగా వెలిసిన పుట్టు గుండంలో దశాబ్దాలు గడుస్తున్నా బావిలోని నీరు (కరువు కాటకాలు ఎదురైనా) నేటికీ పుష్కలంగా ఉండడం మల్లన్న దేవుడి మహిమగా ఆయా గ్రామాల ప్రజలు చెప్పుకొంటారు. పుట్టుగుండంలోని నీటిని ఆయా గ్రామాల రైతులు తమ పొలాల్లో చల్లితే పంటలు బాగా పండుతాయని రైతులు గొప్పగా చెప్పుకుంటారు. బండ మల్లన్న జాతర అనంతరం రెండు రోజుల పాటు వీరారెడ్డిపల్లి, జంగపల్లి గ్రామాల్లోని ప్రజలు జాతరను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. మల్లికార్జున దేవాలయంలో సహజ సిద్ధంగా వెలసిన కారణంగా బండ మల్లన్నగా పేరు ప్రసిద్ధి చెందింది. ఈ జాతరకు వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లిన వారు సైతం బండ మల్లన్నను దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటారు.