ఐదేండ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు
సంగారెడ్డి జిల్లాలో 1,86,190 మంది చిన్నారులు
36 మొబైల్బృందాలు, 1,119 బూత్‌ల ఏర్పాటు
మెదక్ జిల్లాలో 73,450 మంది చిన్నారులు
సంగారెడ్డి కలెక్టరేట్, ఫిబ్రవరి 26: పోలియో రహిత సమాజమే లక్ష్యంగా నేటి నుంచి మూడు రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి మొదలుకొని ఐదేండ్ల్లలోపు చిన్నారులకు చుక్కల మందు వేయనున్నారు. ప్రయాణ ప్రాంగణాలు, తాత్కాలిక వలస కార్మికుల నివాస ప్రాంతాలు, ఇటుక బట్టీలు, నిర్మాణ పనులు జరిగే ప్రాంతాలు, జనసమ్మర్ధ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు.
జిల్లాలో నేటి నుంచి మార్చి 1వ తేదీ వరకు నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. 36 మొబైల్ బృందాలు, 1,119 బూత్‌లు ఏర్పాటుచేశారు. ఇందులో 922 కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా, 197 బూత్‌లు పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటుచేశారు. జిల్లాలో మొత్తం 1,86,190 మంది ఐదేండ్ల లోపు చిన్నారులున్నారు. వీరికి చుక్కల మందు వేసేందుకు 4,476 మంది వ్యాక్సినేటర్లు, 1,583 మంది వైద్య, ఆరోగ్య సిబ్బంది, 1,344 మంది అంగన్వాడీలు, 940 మంది ఆశా వర్కర్లు, 596 మంది ఇతర వలంటీర్లు, 10 మంది ప్రోగ్రాం అధికారులు విధులు నిర్వర్తించనున్నారు. ఈ సందర్భంగా శనివారం కళాశాల విద్యార్థులు, వైద్య ఆరోగ్య సిబ్బందితో జడ్పీ కార్యాలయం నుంచి జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖాన వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని అదనపు కలెక్టర్ రాజర్షి షా జెండా ఊపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్స్ పోలియోను ఆదివారం నుంచి జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని ప్రయాణ ప్రాంగణాలు, వలస కార్మికుల నివాస ప్రాంతాలు, ఇటుక బట్టీలు, నిర్మాణ పనుల ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఏంఆండ్హెచ్వో డాక్టర్ గాయత్రీదేవి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి శశాంక్ దేశ్ పాండే, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎల్లయ్య, ఆయా కళాశాలల విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
పల్స్‌పోలియోకు ఏర్పాట్లు పూర్తి
అందోల్, ఫిబ్రవరి 26: 0-05 ఏండ్ల పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తాలెల్మ మెడికల్ ఆఫీసర్ సత్యనారాయణ సూచించారు. ఆదివారం అన్ని గ్రామాల్లో చుక్కల మందు వేస్తారని, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వైద్య, అంగన్వాడీ సిబ్బంది సహకరించాలని కోరారు. అందోల్, వట్పల్లి మండలాల్లో 0-5 ఏండ్ల వయస్సు పిల్లలు 7912 మంది ఉన్నారని, 69 బూతులు ఏర్పాటు చేశామని తెలిపారు. 2 మోబైల్ టీంలు, 2 ట్రాన్సిట్ టీమ్‌లు పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారని అన్నారు.
మెదక్ జిల్లాలో పల్స్ పోలియోకు సర్వం సిద్ధం
మెదక్ అర్బన్: మెదక్ జిల్లాలో చుక్కల మందు వేయడానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాలో 21 మండలాలు, నాలుగు మున్సిపాలిటీలు, 19 పీహెచ్‌సీలు ఉన్నాయి. 0-5 ఏండ్లలోపు చిన్నారులు 73,450 మంది ఉన్నారు. 19 పీహెచ్‌సీల్లో 53 మంది సూపర్వైజర్లు, 20 మొబైల్ టీంలు, 20 ట్రాన్సిట్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇటుక బట్టీలు, క్వారీలు, వలస, భవన నిర్మాణ కార్మికుల పిల్లలు ఉండే సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు. ఈ కార్యక్రమం మూడు రోజులు నిర్వహించనున్నారు.
లక్ష్య సాధనకు కృషి చేయాలి
జిల్లాలో పల్స్ పోలియో 100 శాతం విజయవంతం చేసేందు కు అధికారులందరూ అంకిత భావంతో పనిచేయాలి. జిల్లాలో సరిపోయే పల్స్ పోలియో డోస్‌లు సిద్ధంగా ఉంచాం. 0 నుంచి 5 ఏండ్ల పిల్లలందరికీ తప్పనిసరిగా చుక్కల మందు వేయించాలి. ఆయా శాఖల అధికారులు లక్ష్య సాధనకు కృషి చేయాలి.
–ఎం.హనుమంతరావు, కలెక్టర్