హుస్నాబాద్ టౌన్, డిసెంబర్ 18: ఖాకీ అనగానే కర్కశత్వం ఉన్నవారు కాదు అని నిరూపించాడు. న్యాయం కోసం ప్రజలు పీఎస్‌కు వచ్చేలా చేశాడు..ప్రజల పోలీస్‌గా పేరు సంపాదించుకున్నాడు దివంగత ఎస్సై జాన్‌విల్సన్. 32 ఏండ్ల క్రితమే ఫ్రెం డ్లీ పోలీస్‌కు శ్రీకారం చుట్టి ప్రజాపోలీస్‌గా మారాడు.
మందుపాతర ఘటనకు 32 ఏండ్లు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంతం నక్సల్బరి ఉద్యమానికి ఊపిరిపోసిన నేల..అలాంటి విప్లవ ఉద్యమం తీవ్రస్థాయిలో సాగుతున్న క్రమంలోనే 1991 డిసెంబర్ 18న నేటి అక్కన్నపేట మండలం రామవరంలో ఆర్టీసీ బస్సును నక్సల్స్ కాల్చివేశారు.ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు డిసెంబర్ 19న హుస్నాబాద్ ఇన్చార్జి సీఐగా ఉన్న యాదగిరి, హుస్నాబాద్ ఎస్సైగా పనిచేస్తున్న జాన్‌విల్సన్‌తోపాటు పలువురు సీఆర్పీఎఫ్ పోలీసులు, ఆర్టీసీ డిపో మేనేజర్, కంట్రోలర్, ఇద్దరు కండక్టర్లు, ఒక డ్రైవర్, ఇద్దరు గ్రామ సేవకులు, ఇద్దరు మిలిటెంట్లు రామవరం గ్రామానికి వెళ్లారు. దర్యాప్తు అనంతరం తిరిగి మరో ఆర్టీసీ బస్సులో హుస్నాబాద్‌కు వస్తుండగా నక్సల్స్ అమర్చిన మందుపాతర పేలడంతో 18 మంది మృతి చెందారు. రామవరంలో మందుపాతర పేలిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను సం చలనం సృష్టించింది. ఘ టనలో పోలీసులు, ఆర్టీ సీ సిబ్బందితోపాటు పలువురు ప్రా ణాలు కోల్పోవడంతో పోలీస్వర్గాలతోపాటు నాటి ప్రభుత్వాన్ని సైతం కలవరపరిచింది.
కన్నీరు పెట్టిన హుస్నాబాద్
నక్సల్స్ పేల్చిన మందుపాతర ఘటనలో ఎస్సై జాన్‌విల్సన్ మృతిచెందాడనే వార్త హుస్నాబాద్ ప్రాంతవాసులను ఉలిక్కిపాటుకు గురిచేసింది. మందుపాతర వార్త దావనంలా వ్యాప్తించడంతోపాటు ఈ ప్రాంతవాసుల కంటకన్నీరు పెట్టించింది. ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న జాన్‌విల్సన్ మృతిచెందాడనే వార్త తెలుసుకుని ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. జాన్‌విల్సన్ కాంస్య విగ్రహాన్ని సైతం స్థానిక పీఎస్ ఎదుట ప్రజల సహకారంతో పోలీస్‌శాఖ ఏర్పాటు చేసింది. ఆయన వర్ధంతిని జాన్‌విల్సన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ ఘటన జరిగి 32 ఏండ్లు గడిచినప్పటికీ ఈ ప్రాంత ప్రజల గుండెల్లో జాన్‌విల్సన్ నేటికీ చిరస్మరణీయుడే.