కోహెడ, అక్టోబర్ 26 : రాజ్యం దుర్మార్గం ఆగనంత వరకు పోరాటం కొనసాగుతుందని పౌరహక్కుల సంఘం, పీస్ కమిటీ, ఆదివాసీ హక్కుల సంఘం, పూర్వవిప్లవ విద్యార్థుల సంఘం, భారత ప్రజా న్యాయవాదుల సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం, రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ నాయకులు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కోహెడలో జరిగిన కడారి సత్యనారాయణరెడ్డి, ఖాతా రాంచంద్రారెడ్డి సంస్మరణ సభకు హాజరై మాట్లాడారు. బస్తర్ ప్రాంతంలో విప్లవ పోరాటం అణిచివేస్తే ఆగదని, పలురూపాల్లో ఉద్యమిస్తూనే ఉంటుందని అన్నారు. ఆదివాసీ బిడ్డల హక్కులను కాలరాసి కార్పొరేట్లకు జాతి సంపదను కట్టబెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆదివాసీ బిడ్డలకు అండగా జరిగిన పోరాటంలో అసువులు బాసిన కడారి సత్యనారాయణరెడ్డి, ఖాతా రాంచంద్రారెడ్డికి జోహార్లు అర్పించారు.
వారు భౌతికంగా లేకపోయినా ఆదివాసీ బిడ్డల గుండెల్లో కొలువై ఉంటారని పేర్కొన్నారు. రాజ్యం దుర్మార్గం రోజురోజుకు పెరిగిపోతున్నదని, బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతోందన్నారు. నక్సల్బరి ఉద్యమాన్ని అణిచివేస్తే ఊరుకునేది లేదని, సమస్య పరిష్కారమైతేనే ఉద్యమానికి న్యాయం జరుగుతుందన్నారు. కోర్టులపై సామాన్య ప్రజలకు నమ్మకం లేకుండా పోతున్నదని, సత్యనారాయణరెడ్డి, రాంచంద్రారెడ్డి మృతదేహాలను అప్పగించేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అంగీకరించలేదన్నారు. రాంచంద్రారెడ్డి బంధువులు హైకోర్టుకు వెళ్ల్లగా నిరాకరించిందని, దీంతో సుప్రీంకోర్టుకు వెళ్ల్లాల్సి వచ్చిందన్నారు. కోర్టు తీర్పు వాయిదాలో ఉంచిందని, రీ పోస్ట్‌మార్టం చేయిస్తారన్న నమ్మకం ఉందన్నారు. బూటకపు ఎన్కౌంటర్ల నిగ్గును తెలుస్తుందన్న నమ్మకం ఉందన్నారు.
బస్తర్ ప్రాంతంలో ఎన్కౌంటర్లు జరిగితే శవాలు బంధువులకు అప్పగించే పరిస్ధితి లేదని, మృతదేహాలు పురుగులు పడి పుచ్చుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో అపార ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్ట్టేందుకు 2026 మార్చి 31లోగా కగారు పేరుతో ఆపరేషన్ కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని, ఎంతో మంది ప్రాణాలను ఎన్కౌంటర్ల పేరిట బలిగొంటారో చూస్తామన్నారు.ఛత్తీస్‌గఢ్‌లో ఉద్యమం ఆపాలని చూస్తే ఆగదన్నారు. రాజ్యాంగంలోని 5,6 సెక్షన్ల ప్రకారం ఆదివాసీ బిడ్డల హక్కులు కాపాడాల్సిందే అని అన్నారు.
దేశంలో చట్టబద్ధ పాలన లేదని, ఆపరేష్ కగార్‌ను అపకుంటే రాజ్యంపై పోరాటం ఆగదన్నారు. అంతకు ముందు రాంచంద్రారెడ్డి, సత్యనారాయణరెడ్డి చిత్రపటాలకు పూలు చల్లి నివాళులర్పించారు. సంస్మరణ సభకు సుమారు 500మంది హాజరయ్యారు. కార్యక్రమంలో ఆమరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షురాలు కామ్రేడ్ పద్మకుమారి, పీస్ కమిటీ అధ్యక్షుడు జస్టిస్ బి.చంద్రకుమార్, ఆదివాసీ హక్కుల కార్యకర్తల సోనీసోరి, పలు సంఘాల నాయకులు గాదె ఇన్నయ్య, ఎన్.నారాయణరావు, మాదన కుమారస్వామి, పాణి, కవ్వా లక్ష్మారెడ్డి, డి.సురేశ్‌కుమార్, ఆజాద్, వి.సంధ్య, వి.పెంటయ్య, హుస్సేన్, బల్ల రవీంద్రనాథ్, రాంచంద్రారెడ్డి భార్య శాంత, తమ్ముడు ఖాతా వెంకట్‌రెడ్డి, స్థానిక నాయకులు పెరుగు వీరారెడ్డి, తడ్కలరాజిరెడ్డి, పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.